వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన సిద్దూరి పాపారావు అనే రైతు ఎంతో ప్రేమగా చూసుకుంటున్న తన రెండు ఎద్దులను వ్యవసాయబావి దగ్గరకు తీసుకెళ్లాడు. పది రోజులుగా కురుస్తున్న వర్షానికి నేలంతా నానిపోయి ఉంది. ఎద్దులు మేత మేస్తున్న సమయంలో... ఒక్కసారిగా విద్యుత్ స్తంభం ఓ ఎద్దుపై కూలింది. మరో వృషభంపై కరెంటు తీగలు పడ్డాయి. ప్రమాదంలో రెండు మూగజీవాలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఎద్దులు దాదాపు లక్షరూపాయల విలువ ఉంటాయని యజమాని తెలిపాడు. కుటుంబంతో మమేకమైన మూగజీవాలు మృతి చెందటం వల్ల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విగతజీవాలుగా పడి ఉన్న ఎద్దులపై పడి ఏడుస్తున్న ఆ కుటుంబసభ్యులను చూసి మిగతావారి కళ్లు కూడా చమర్చాయి.
ఇవీ చూడండి: 'వెంకయ్య, సుష్మల అన్నాచెల్లెల అనుబంధం'