Migration for duck Feeding: బాతుల పెంపకం కోసం రాష్ట్రం దాటి వచ్చింది ఓ కుటుంబం. వరంగల్ జిల్లా వర్దన్నపేట పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కందుకూరు మండలం ఆనందపురం గ్రామానికి చెందిన శ్రీను, రమణమ్మ దంపతులు బాతులను పెంచుతున్నారు. అక్కడ బాతుల పెంపకానికి సౌకర్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడటంతో ఇలా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. 4 వేల బాతు పిల్లలతో గుడారాలు ఏర్పాటు చేసుకుని బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ బాతులు 7 నెలల పోషణ అనంతరం గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. ఆ 7 నెలలూ వాటిని పెంచేందుకు వివిధ ప్రాంతాలు తిరుగుతూ వరి కోసిన పొలాల్లో ఇలా గుడారాలు ఏర్పాటు చేసుకుని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు వరి చేలలో మేతకు తీసుకెళ్తారు. ఈ క్రమంలో ఈ ఏడు నెలలూ వీరికి గడ్డు కాలమే అని చెప్పాలి.
'బాతులు గుడ్లు పెట్టే వరకు వాటిని పోషిస్తూ వివిధ ప్రాంతాలకు తిరుగుతూనే ఉంటాం. ఆ గుడ్లను కూడా ఇతర రాష్ట్రాల వారే కొంటారు. బతుకు దెరువు కోసం ఈ తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి.. ప్రోత్సాహం అందించాలి.' - శ్రీను, రమణమ్మ దంపతులు
అక్కడే డిమాండ్
ఎంతో కష్టపడితే కానీ బాతుల పోషణ జరగదు. బాతులు పూర్తి స్థాయిలో ఎదిగిన తరువాత వాటి గుడ్లను రూ.3 నుంచి 6 రూపాయలకు కొనుగోలు చేస్తారు. ఈ గుడ్లు మహారాష్ట్ర, కలకత్తా, తమిళనాడు, బెంగళూరు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్తాయి. స్థానికంగా బాతు గుడ్లు, మాంసానికి పెద్దగా రేటు ఉండదు. ఇతర రాష్ట్రాల్లో వీటికి డిమాండ్ ఎక్కువ. ఫోన్ ద్వారా వీరిని సంప్రదించి ఎక్కడున్నా వాహనాల ద్వారా వచ్చి తీసుకెళ్తుంటారని పెంపకదారులు చెబుతున్నారు.
ఆదుకోవాలి
సౌకర్యాల లేమితో ప్రతి యేటా ఇలా వలస తప్పదని పెంపకందారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం తాము పడుతున్న అవస్థలు గమనించి బాతుల పెంపకానికి ప్రోత్సాహం అందించాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: Organic Farming Jagtial : వినూత్న ఆలోచనలతో సాగు.. లాభాలు బాగు