Revanth Reddy Comments on CM KCR: ధరణి పోర్టల్ పేరుతో ప్రభుత్వమే భూ దందాలు చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తనపై మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను.. రేవంత్ రెడ్డి ఖండించారు. వాస్తవాలు నిగ్గు తేల్చడానికి సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్దమని.. మరి మంత్రి కేటీఆర్ కూడా సిద్దమా అని సవాల్ విసిరారు.
రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నిజాం నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను కొల్లగొట్టారని విమర్శించారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూములను ఎన్ని వేల ఎకరాలు ఆ జాబితా నుంచి తొలగించారో.. అవి ఎవరెవరి పేర్ల మీద బదలాయించారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రజాప్రతినిధులు, ఉద్యమ నాయకులు, ప్రజలను అనుమతించని ప్రగతిభవన్ గేట్లను.. కచ్చితంగా బద్దలు కొడతాం. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ భూములను కేటీఆర్ బృందం కొల్లగొట్టింది. ఈ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు కేటీఆర్ సిద్ధమా? - రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
అమెరికన్ కంపెనీని బెదిరించి తెల్లాపూర్‌లో ప్రతిమా శ్రీనివాస్ పేరు మీద రూ.5 వేల కోట్ల విలువైన భూములను బదలాయించారని.. అందులో మంత్రి కేటీఆర్‌కు భాగస్వామ్యం ఉందని ఆరోపణలు చేశారు. రూ.వేల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని రేవంత్ అన్నారు. రూ.500 కోట్ల విలువైన.. ఐదెకరాల భూమి కవితకు మియాపూర్‌లో ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
తన కుమార్తె భూ దాహం కోసమే రెడ్యా నాయక్ బీఆర్ఎస్ పార్టీకి మారారు. తన కొడుకు చేసే భూ దందాలు...కేసీఆర్‌కు కనిపించడం లేదా? అక్రమాలు చేసే అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కటకటాల్లోకి వేస్తోంది. మేము అధికారంలోకి రాగానే.. ప్రగతి భవన్‌ను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్‌గా మారుస్తాం. యాత్రను అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. అందుకే యాత్రకు పోలీసు బందోబస్తు తీసేశారు. యాత్రలో గందరగోళం సృష్టించే అవకాశం ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమతంగా ఉండాలి. - రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇక మహబూబాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి 4వ రోజు హాథ్ సే హాథ్ జోడో యాత్ర కొనసాగుతోంది. నర్సింహులపేట మండలం పెద్ద నాగారం స్టేజ్ నుంచి రేవంత్ రెడ్డి యాత్ర ఉత్సాహంగా ప్రారంభమైంది. మరిపెడ మండలం కేంద్రం శివారు బక్కరూప తండా వద్ద రేవంత్ రెడ్డి భోజన విరామం కోసం ఆగారు. ఆ తర్వాత మళ్లీ యాత్ర ప్రారంభమై కొనసాగుతోంది.
ఇవీ చూడండి..