ప్రభుత్వాల అధీనంలో ఉన్న అనేక ప్రాచీన ఆలయాలు ఆలనాపాలనా లేక శిథిలావస్థకు చేరుతుండగా.. అక్కడ మాత్రం గ్రామస్థులే ఊళ్లోని చారిత్రక ఆలయాలను పునరుద్ధరించుకొని(Preservation of ancient temples) కాకతీయుల నాటి స్ఫూర్తిని చాటుతున్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరులోని సుమారు 900 ఏళ్ల కిందట కాకతీయుల కాలంలో నిర్మించిన పంచకూటాలయం 60 ఏళ్లుగా శిథిలావస్థలో ఉంది. దీనికి పూర్వవైభవం తేవాలని గ్రామస్థులు సంకల్పించి రూ. కోటికిపైగా చందాలు వేసుకొని ఏడాదిన్నర కిందట పునర్నిర్మాణం పనులు ప్రారంభించారు. తమిళనాడు నుంచి స్థపతిని తీసుకొచ్చి పూర్తిగా రాళ్లతోనే గుడిని తీర్చిదిద్దుతున్నారు. అతుకులకు కాకతీయుల పద్ధతిలోనే కరక్కాయ, తేనె మిశ్రమాలను డంగుసున్నంలో కలిపి వినియోగిస్తున్నారు. 90 శాతం పూర్తయిందని, త్వరలో ప్రతిష్ఠాపన చేస్తామని ఆలయ కమిటీ ఛైర్మన్ బుచ్చిరెడ్డి తెలిపారు.
![](https://assets.eenadu.net/article_img/gh-main20b_1.jpg)
శ్రమదానం చేసి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలోని త్రికూటేశ్వరాలయం శిథిలావస్థకు చేరింది. ఆరు నెలల క్రితం గ్రామానికి చెందిన 30 మంది యువకులు శ్రమదానంతో ఆలయాన్ని శుభ్రం చేసి భక్తుల సందర్శనకు వీలుగా సొంత నిధులతో మరమ్మతు చేసి ఘనంగా ప్రారంభోత్సవం చేశారు.
ఖమ్మం జిల్లా కూసుమంచిలోని రామలింగేశ్వరాలయాన్ని గ్రామస్థులు బాగు చేశారు. ఈ ఆలయ చరిత్రపై చరిత్రకారుడు కట్టా శ్రీనివాస్ పుస్తకం రాయడంతో మరికొన్ని నిధులు సమకూరాయి.
వరంగల్ సమీపంలోని ఐనవోలు మండలం పంథిని గ్రామ పరిధిలో 1200 ఏళ్ల నాటి శివాలయం శిథిలమవగా గ్రామ ప్రజలు విరాళాలతో బాగు చేసుకున్నారు. 2018లో మళ్లీ ప్రతిష్ఠాపన జరిగింది.
సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలంలో కాకతీయులు నిర్మించిన రుద్రేశ్వరాలయాన్ని గ్రామస్థులే విరాళాలతో పదేళ్ల కిందట సర్వాంగ సుందరంగా పునర్నిర్మించారు.
![](https://assets.eenadu.net/article_img/gh-main20c.jpg)
కొండంత సంకల్పం
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ సమీపంలోని పెద్ద చెరువు పరిసరాల్లో ఉన్న కాకతీయుల నాటి శివాలయం శిథిలావస్థకు చేరుకొంది. గ్రామస్థులు దానిని పునర్నిర్మించేందుకు(Preservation of ancient temples) సంకల్పించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఉదారంగా విరాళాలు అందజేశారు. రూ. 1.50 కోట్ల వరకు సమకూరాయి. పక్కనే ఉన్న పెద్ద కొండపై శిల్పాలతో ఆలయాన్ని నిర్మించి కొండపైకి దారి కూడా ఏర్పాటుచేశారు.
![](https://assets.eenadu.net/article_img/gh-main20d.jpg)
అంతులేని నిర్లక్ష్యం
రాష్ట్రంలో 382 ప్రాచీన ఆలయాలు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. వాటిలో అనేకం శిథిలావస్థకు చేరినా పునర్నిర్మాణ పనులు జరగడం లేదు. కొన్నింటిని పునర్నిర్మాణం కోసం విడదీసిపెట్టి దశాబ్దాలు గడుస్తున్నా నిధులు విడుదల కాక పూర్తి కావడం లేదు. ములుగు జిల్లా రామానుజపురం, జాకారంలో కాకతీయుల నాటి ఆలయం, జనగామ జిల్లా ముప్పిరనాథ స్వామి దేవాలయం, సిద్దిపేట జిల్లాలోని గొడిశాల రాజరాజేశ్వరాలయం.. ఇలా రాష్ట్ర పురావస్తు శాఖ పునర్నిర్మాణం కోసం చేపట్టిన ఎన్నో ఆలయాలు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. కేంద్ర పురావస్తు శాఖ వేయి స్తంభాల గుడిలోని కల్యాణమండపం పునర్నిర్మాణం పనుల్ని 16 ఏళ్ల కిందటే మొదలుపెట్టినా ఇప్పటికీ పూర్తి చేయడం లేదు.