ప్లాస్మా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పోలీసులు ప్రకటించారు. వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్‌లో 14 మంది సిబ్బంది కరోనా బారిన పడగా.... ఏడుగురు కానిస్టేబుళ్లు త్వరితగతిన కోలుకుని తిరిగి విధుల్లో చేరారు. కొవిడ్‌ను జయించిన సిబ్బందిని ఏసీపీ రమేశ్ పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. తమ సిబ్బంది గత ఐదు నెలలుగా... కష్టపడి పని చేస్తున్నారని ఏసీపీ ప్రశంసించారు.
కరోనా వచ్చినప్పటికీ మనోధైర్యంతో ఉండి తగు జాగ్రత్తలు తీసుకొని కరోనాను జయించడం గొప్ప విషయమన్నారు. ముఖ్యంగా కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నవారికి అవసరమైన ప్లాస్మా దానం చేసేందుకు తమ సిబ్బంది సిద్ధంగా వున్నారని తెలిపారు. ఎవరికైనా ప్లాస్మా అవరసరం ఉంటే తమను సంప్రదించాలని ఏసీపీ సూచించారు. కరోనా పట్ల అపోహలు వద్దని... తగు జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చని వివరించారు.