వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం గవిచర్లలో బావిలో గల్లంతైన వారి కోసం అధికారుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో వరంగల్ నుంచి నెక్కొండకు ప్రయాణీకులతో వెళుతున్న జీపు అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న బావిలోకి దూసుకుపోయింది. జీపు డ్రైవర్ సతీశ్‌కు ఫిట్స్ రావడం వల్ల వేగంగా వచ్చి బావిలో పల్టీ కొట్టింది. మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటామనుకున్న వారంతా బావిలో తేలడం వల్ల ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. సాయం కోసం అరుస్తూ బయటపడేందుకు ప్రయత్నించారు. స్వల్పగాయాలతో నెక్కొండ పరిసర గ్రామాలకు చెందిన 10మంది సురక్షితంగా బయటపడ్డారు. రాంచందర్ అనే వ్యక్తి... నలుగురిని కాపాడారు.
డ్రైవర్‌కు ఫిట్స్ రావడమే కారణం
రహదారి గుంతలు పడి ఉండడం, వేగం తగ్గించకపోవడం, అదే సమయంలో డ్రైవర్‌కు ఫిట్స్ రావడం ప్రమాదానికి కారణమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తూర్పుమండల డీసీపీ వెంకటలక్ష్మి, మామునూర్ ఏసీపీ శ్యాంసుందర్, అగ్నిమాపక అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. 30 అడుగుల లోతైన బావి.. వర్షాలకు నిండుకుండలా మారటం, చుట్టూ చీకటి కావడం వల్ల జీపును బయటికి తీయడం కష్టంగా మారింది. మూడున్నర గంటల పాటు శ్రమించిన అధికారులు... క్రేన్ సాయంతో వాహనాన్ని బయటకు తీశారు. ఇందులో జీపు డ్రైవర్, ఎనుగల్లు గ్రామానికి చెందిన సతీష్ మృతదేహం మాత్రమే ఉంది. గల్లంతైన మరో ముగ్గురి కోసం రాత్రంతా గాలించారు.
మంత్రుల ఆరా
దుర్ఘటనపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ ఆరాతీశారు. ప్రమాదతీరు, సహాయక చర్యలపై కలెక్టర్, సీపీతో మాట్లాడిన మంత్రులు.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రహదారి పక్కన ఉపయోగంలో లేనిబావులు, గోతులను వెంటనే మూసివేయించాలని ఆదేశించారు. కాగా... రోడ్లపక్కనే బావులతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా... హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయటంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చూడండి: క్రేన్ సాయంతో జీపును బయటకు తీసిన పోలీసులు