కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యం నాణ్యతా ప్రమాణాలపై రైతులకు ముందుగానే అవగాహన కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులకు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆరూరి రమేశ్, వరంగల్ రూరల్, జనగామ కలెక్టర్లు, అధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు చేసే ధాన్యంలో తాలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. తూనికల్లో అవకతవకలకు తావీయ వద్దన్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4లక్షల 81వేల 345 ఎకరాల్లో ధాన్యం పండిందని మంత్రి తెలిపారు. 11లక్షల 68వేల 389 మెట్రిక్ టన్నుల దిగుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు.
895 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటి వరకు 566 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని... మిగతా వాటిని వీలైనంత త్వరగా ప్రారంభించాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. గిన్నీ బ్యాగుల కొరత ఉందని రైతులు అంటున్నారని... మొత్తం 21 లక్షల గిన్నీ బ్యాగుల్లో ఇంకా 6 లక్షల బ్యాగులు రావాల్సి ఉందని మంత్రి తెలిపారు. లాక్డౌన్ను పటిష్ఠంగా నిర్వహించాలని... రెడ్ జోన్లలో గట్టి నిఘాను పెట్టాలన్నారు.
ఇదీ చూడండి: ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్