Minister Harish Rao review: పేదలకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. హనుమకొండలో పర్యటించిన మంత్రి జిల్లా కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించారు. హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు, అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఆస్పత్రుల్లోని వైద్య పరికరాలు పాడైతే... 24గంటల్లో మరమ్మతులు చేయాలని... అందుకోసం 20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఐవీఎఫ్ సేవలూ వరంగల్‌కు విస్తరిస్తామని తెలిపారు. త్వరలోనే 13 వేల వైద్యుల ఖాళీలు భర్తీ చేస్తామన్న మంత్రి.. కొత్త నియామకాల ద్వారా వచ్చే వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధిస్తూ విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇకపై వైద్య, ఆరోగ్య శాఖపై ప్రతి నెల సమీక్షా నిర్వహిస్తామని తెలిపారు.
అంతకుముందు భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న హరీశ్ రావు తెరాస హయాంలో సర్కారు దవాఖానాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. నెలరోజుల్లోనే కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. నేడు మంత్రి హరీశ్‌రావు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో పర్యటించనున్నారు. 14 కోట్లతో చేపట్టనున్న కోనారెడ్డి చెరువు మరమ్మతులు, 2కోట్లతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ పనులకు భూమి పూజ చేయనున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తెలిపారు. అనంతరం బహిరంగ సమావేశంలో మంత్రి పాల్గొననున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: ఉసురు తీసిన పెంచిన ప్రేమ.. దురలవాట్లతో దత్త పుత్రుడి ఘాతుకం
దివ్యాంగ చిన్నారికి విమానంలో నో ఎంట్రీ.. కేంద్రమంత్రి ఫైర్.. దిగొచ్చిన ఇండిగో!