వరంగల్ ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యల గురించి టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి చర్చించారు. నగరాల నుంచి కరోనా క్రమేణా పట్టణాలు, గ్రామాలకు విస్తరించి సామాజిక సమస్యగా మారుతోందని మంత్రి తెలిపారు.
ప్రజల కోసం పని చేస్తున్న డాక్టర్లు, పోలీసులు, అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిదులందరికీ ఈ వ్యాధి ప్రబలుతున్నదని మంత్రి చెప్పారు. ఈ దశలోనే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు..
కరోనా నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, చికిత్సలకు అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తున్నామని, మందులు, బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఐసోలేషన్ సెంటర్లు అన్ని సిద్ధం చేశామని మంత్రి వివరించారు. ప్రజల్లో వ్యాధి పట్ల ఇంకా చైతన్యం, అవగాహన పెంచాలని చెప్పారు. బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం, స్వీయ నియంత్రణలో ఉండటం, మాస్కులు తప్పనిసరిగా ధరించడం, అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకుండా ఉండటం పట్ల ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు.
నిధులన్నీ.. కరోనా వైద్య సదుపాయాలకే..
ఎంపీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధి నిధులన్నింటినీ కరోనా వైద్య సదుపాయాల పెంపు కోసమే వినియోగించాలని ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. ఈ విపత్తును నుంచి ప్రజలను పూర్తిగా బయట పడేసే వరకు ఇతర అభివృద్ధి పనులకంటే కరోనా నివారణకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వైద్యశాలల్లో సదుపాయాలు, పరికరాల కోసం ప్రజా ప్రతినిధులు తమకు కేటాయించిన నిధులను వెచ్చించాలని సూచించారు.
త్వరలో అందుబాటులోకి పీఎంఎస్ఎస్వై ఆస్పత్రి..
వరంగల్ సెంట్రల్ జైలు ఆవరణలో నిర్మితమైన పీఎంఎస్ఎస్వై ఆస్పత్రిని సాధ్యమైనంత వేగంగా అందుబాటులోకి తేవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిధులకు సంబంధించిన సమస్యలేమైనా ఉంటే వాటిని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. వరంగల్ ఆయుర్వేద కేంద్రాన్ని ఐసోలేషన్ కేంద్రంగా వాడుకోవాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు.
క్వారంటైన్ కేంద్రాలు పెంచాలి..
గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా వైరస్ విస్తరిస్తున్నందున పెద్ద పట్టణాలు, అందుబాటులోని ప్రధాన పెద్ద భవనాలను ఐసోలేషన్ కేంద్రాలుగా వినియోగించుకోవడంపై దృష్టి సారించాలని మంత్రి అధికారులకు సూచించారు. గ్రామాల్లో పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు గ్రామాల పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించారు.
మెరుగైన చికిత్సలు అందిద్దాం..
తరచూ నిర్వహిస్తున్న మౌఖిక, టెలి సమీక్షల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని మంత్రి తెలిపారు. జులై15న నిర్వహించిన సమీక్ష తర్వాత ఐదు రోజుల్లోనే ఎంజీఎం ఆస్పత్రికి అవసరమైన సదుపాయాలు సమకూరాయాని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చొరవతో మరిన్ని సదుపాయాలు సమకూర్చుకోవాలని ఇద్దరు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ నిర్ణయించారు.
కరోనా అనుభవాలు పంచుకున్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
కరోనా వైరస్‌తో భయపడాల్సిన పనే లేదని ఆ వైరస్ బారిన పడి పూర్తిగా కోలుకున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. 60ఏళ్ళ పైబడి ఉన్న తాను, తనకంటే పెద్ద వాళ్ళైన తన కుటుంబ సభ్యులు, బంధువులు, తన కంటే చిన్నవాళ్ళైన తన సిబ్బంది మొత్తం ఎలాంటి మందులు వాడకుండానే కోలుకున్నామన్నారు. బలవర్ధకమైన ఆహారం వేడిగా ఉన్నప్పుడే తీసుకోడం, స్వీయ నియంత్రణలో విశ్రాంతి తీసుకుని కోలుకున్నట్లు చెప్పారు. రోగ నిరోధక శక్తి పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే తన అనుభవాన్ని టెలీ కాన్ఫరెన్సులో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో పంచుకున్నారు.
మూడు నెలల్లోగా కల్లాలు, గోదాములు, రైతు వేదికలు సిద్ధం చేయాలి
సీఎం కేసీఆర్ కరోనా కష్టంలోనూ ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని వీడలేదని, అందుకనుగుణంగా రైతు వేదికలు, కల్లాలు, గోదాముల నిర్మాణాలను అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ 3 నెలల్లోగా పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.
ఇదీ చూడండి: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు