Kandikonda Funerals: ప్రముఖ సినీ గేయ రచయిత.. కందికొండ యాదగిరి అంత్యక్రియలు ముగిసాయి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లిలో... కుటుంబ సభ్యులు, అభిమానులు గాయకుల మధ్య... అంతిమసంస్కారాలు ముగిశాయి. కందికొండ యాదగిరి పార్థీవ దేహాన్ని చివరిసారిగా చూసేందుకు వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లికి అభిమానులు, గాయకులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మానకొండూరు శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ కందికొండ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కందికొండ అకాల మరణం సినీరంగానికి కాకుండా యావత్ తెలంగాణకు తీరనిలోటని తెలిపారు. కందికొండ అంతిమ యాత్రలో పాల్గొన్న రసమయి... యాదగిరి పాడెను మోశారు. కందికొండ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు యాదగిరి కుమారునికి... తెలంగాణ సాంస్కృతిక సారధిలో కీబోర్డ్ ప్లేయర్గా ఉద్యోగం ఇప్పిస్తానని... హామీ ఇచ్చారు. పలువురు గాయకులు కందికొండ యాదగిరిపై పాటలు పాడి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇంటర్ చదువుతున్న సమయంలోనే..
హృదయాలను హత్తుకునేలా ఎన్నో పాటలు రాసిన కందికొండ.. చక్రి సంగీత దర్శకత్వంలో ఎక్కువ పాటలు రాశారు. ఆయన పూర్తి పేరు కందికొండ యాదగిరి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో కందికొండ జన్మించారు. ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యం, రచనలపై తనకున్న ఆసక్తి కారణంగా క్రమంగా సినీ రంగంవైపు అడుగులు చేశారు. ఇంటర్ చదువుతున్న సమయంలోనే సంగీత దర్శకుడు చక్రితో స్నేహం ఏర్పడింది.
‘మళ్లీకూయవే గువ్వ’ పాటతో..
2001లో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ‘మళ్లీకూయవే గువ్వ’ పాటతో ఆయన గేయ రచయితగా మారారు. మంచి మెలోడీ గీతంగా ఆ పాట శ్రోతలను విశేషంగా అలరించింది. దీంతో చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు తలుపుతట్టాయి. అలా ‘ఇడియట్’లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’లో ‘మధురమే మధురమే’, ‘ఐయామ్ ఇన్ లవ్’, ‘పోకిరి’లో ‘గల గల పారుతున్న గోదారిలా’ ‘జగడమే’, ‘లవ్‌లీ’లో ‘లవ్‌లీ లవ్‌లీ’ తదితర పాటలు రాశారు. చివరిగా 2018లో ‘నీది నాది ఒకే కథ’లో రెండు పాటలు రాశారు.
పల్లెపల్లెనా, గడప గడపనా..
సినిమా పాటలే కాకుండా బతుకమ్మ నేపథ్యంలో రాసి పాటలు పల్లెపల్లెనా, గడపగడపనా జనం నోట మార్మోగాయి. పాటలే కాదు, కవిత్వం రాయడంలోనూ కందికొండ దిట్ట. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయడం ఆయన ప్రత్యేకత. మట్టి మనుషుల వెతలు, పల్లెబతుకు చిత్రాలను కథలుగా రచించి కథకుడిగానూ విశేష ఆదరణ పొందారు.
ఇదీ చదవండి: