ట్రాన్స్‌కో 2017లో జూనియర్ లైన్‌మెన్ పోస్టుల్లో తొలిసారి మహిళలకు అవకాశం కల్పించింది. ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేసిన పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నో ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఎత్తైన విద్యుత్తు టవర్లను సునాసంగా ఎక్కి తుది పరీక్షలో పలువురు ఎంపికయ్యారు. కోర్టు కేసులతో మూడేళ్లు ఆలస్యం జరిగినా వీరి ఎదురుచూపులకు ఎట్టకేలకు ఫలితం దక్కింది.
దసరా కానుకగా బుధవారం ట్రాన్స్‌కో అధికారులు ఎంపికైనవారికి నియామకపత్రాలు అందజేశారు. మొత్తం 650 మందిలో 150 మందికి పైగా మహిళలే ఉన్నారని ట్రాన్స్‌కో డైరెక్టర్ ఒకరు తెలిపారు. సంస్థలో ఇప్పటివరకు లైన్‌ఉమెన్‌లు లేరని.. తెలంగాణ వచ్చాక ఒకేసారి పెద్ద ఎత్తున నియామకం చేపట్టామని తెలిపారు. టవర్ ఎక్కే పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి ఈ పోస్టుకు ఎంపికైన లైన్ ఉమెన్ అభ్యర్థి భారతి ట్రాన్స్‌కో వరంగల్ జిల్లాలో బుధవారం నియామక పత్రం అందుకున్నారు. ఆమె స్వస్థలం మహబూబాబాద్ జిల్లా. భర్త ప్రైవేటు ఉద్యోగి, పాప, బాబు ఉన్నారు. ఐటీఐ ఎలక్ట్రికల్ 2015లో పూర్తిచేశారు. భర్త తోడ్పాటుతో ఊళ్లోనే వ్యవసాయ కరెంట్ పనులు చేసేవారు. ఈ క్రమంలోనే స్తంభాలు ఎక్కడం నేర్చుకుని ఈ పోస్టుకు ఎంపికయ్యారు.
ఇదీ చూడండి: Telangana High Court: పెళ్లైతే చదువుకు దూరం కావాలా.. ఆ వృత్తులే ఎందుకు ఎన్నుకోవాలి?