వరంగల్ రూరల్ జిల్లా తిరుమలాయపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో పోలీసుల తప్పేమీ లేదన్నారు జనగామ జిల్లా వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస రెడ్డి. నిరాధార ప్రచారాలను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. మంగళవారం పోలీసు వాహనం, ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు మరణించిన ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు వర్ధన్నపేట ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించి రోడ్డు ప్రమాదం జరిగిన విధానాన్ని ప్రత్యక్షంగా కళ్లకు కట్టినట్టు వివరించారు పోలీసులు. ద్విచక్ర వాహనం, అశోక్ లేలాండ్ ట్రక్కు వల్లనే ఈ ప్రమాదం జరిగిందని.. ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని డీసీపీ విచారం వ్యక్తం చేశారు. అమాయకులైన మృతులు ప్రాణాలు కోల్పోయిన ఘటన వారి కుటుంబాలలోనే కాకుండా పోలీసు అధికారులను చలింపజేసిందన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.