ideal woman farmer Kothapalli : ఉత్తమ రైతు అనగానే పురుషులే అని చాలామంది భావిస్తారు. కాలక్రమేణా రైతు అంటే అది మగవారికే పరిమితమైంది. అయితే ఇటీవల కాలంలో మహిళలు సైతం వ్యవసాయంలో సత్తా చాటుతున్నారు. తమదైన స్టయిల్లో సాగు చేస్తూ... ఉత్తమ రైతులుగా నిలుస్తున్నారు. చిన్నప్పుడు నాన్నతో పొలానికెళ్లి.. అదే అనుభవంతో ఎకరాల్లో సాగు చేస్తూ... ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు ఈ ఆదర్శ రైతు. ఆమే... సీతామహాలక్ష్మి.
ఉత్తమ రైతు..
వరంగల్ జిల్లాకు చెందిన సీతామహాలక్ష్మి... వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. భర్త సత్యనారాయణ పోలీస్ శాఖలో చేసేవారు. రెండేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. భర్త ఉన్నప్పుడు ఆయన ప్రోత్సాహంతో సొంత భూమితో పాటు కొంత కౌలు తీసుకుని మొత్తం 500 ఎకరాల్లో సాగు చేసి... 2000 మందికి ఉపాధి కల్పించారు. ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతు ఆవార్డునూ... పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహా మరెన్నో సంస్థల నుంచి పురస్కారాలను అందుకున్నారు.
'నేను మూడు గంటలు మాత్రమే నిద్రపోతాను. 2000 మందికి పని కల్పిస్తున్నాను. కూలీలకు డబ్బులు ఇచ్చేటప్పుడు వారు చాలా సంతోషపడేవారు. తమ పిల్లలకు బట్టలు కొన్నామని.. మందులు కొన్నామని చెప్పేవారు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండేది. వ్యవసాయం వల్ల నాకు కూడా నష్టాలు జరిగాయి. కానీ దేవుడిని నమ్ముకొని ధైర్యంగా ఇన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నాను. ఇప్పటివరకు బాగానే ఉంది.'
-సీతామహాలక్ష్మి, ఆదర్శ రైతు
వందల మందికి ఉపాధి
ప్రస్తుతం 60 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ... సుమారు 150 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వరి, పత్తి, వేరుశెనగ, కూరగాయలు, మునగ, మామిడి తోటలను తన సోదరుడితో కలిసి సాగుచేస్తున్నారు. అలాగే సేవా కార్యక్రమాల్లో ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారు. కూలీలకు ఎలాంటి ఆపద వచ్చినా... అన్నీ తానై ఆదుకుంటారు. కొవిడ్ సమయంలో అనాథలు, శరణార్థులకు అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. స్థానికంగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు.
మా తాత, నాన్న రైతు. మాది రైతు కుటుంబం. ఓ రైతు బిడ్డగా ఈ సాగు చేస్తున్నాను. గత 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. వరి, కంది, మిర్చి పంటలు వేస్తాం. వంకాయ, బెండకాయ, మునగ వంటి కూరగాయలను ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్నాను. ఓ 300 కుటుంబాలకు పని కల్పిస్తున్నాను. నాకు ట్రాక్టర్ నడపడం, అరక దున్నడం వచ్చు. పురుగుమందులు కూడా పిచికారీ చేయడం వచ్చు.
-సీతామహాలక్ష్మి, ఆదర్శ రైతు
సామాజిక కార్యక్రమాల్లో ఆమె సైతం..
సీతమహాలక్ష్మికి ఇద్దరు కుమారులు. వారు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. 'అమ్మా నాన్న' సేవా సొసైటీ ప్రారంభించిన ఆమె.. వృద్ధులు, అనాథల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓవైపు వ్యవసాయం మరో వైపు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతూ... ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆర్గానిక్ పంటలతో కూడా దిగుబడి బాగానే వస్తుంది. నూనె కూడా ఆర్గానిక్ శెనగతోనే పట్టించుకుంటాం. వ్యవసాయం అంటే మగవారికే పరిమితం కాదు. ఆడవాళ్లు కూడా ఆదర్శంగా పంటలు పండించవచ్చు. నాకు ఉద్యోగం రాలేదు అని మొదట్లో బాధపడ్డాను. కానీ రైతే రాజు అని ఇప్పుడు అనుకుంటున్నాను. ఒకరి కింద పని చేయాల్సిన అవసరం రాదు.
-సీతామహాలక్ష్మి, ఆదర్శ రైతు
ఉన్న పొలంలో మేం పంటలు బాగానే పండిస్తున్నాం. ప్రభుత్వం కూడా రైతు బంధు వంటి పథకాలతో ఆదుకుంటోంది. మేం అన్ని కూడా ఆర్గానిక్ పద్ధతుల్లోనే సాగు చేస్తాం. రసాయనాలు అసలు ఉపయోగించం. ఇప్పటివరకు దిగుబడి బాగానే వస్తుంది. మా చెల్లి, నేను ఈ పంటలు సాగు చేస్తున్నాం.
-వెంకట్ రావు, సీతామహాలక్ష్మి సోదరుడు
మేడమ్ కూరగాయలు, పండ్ల తోటలు, వరి, కంది వంటివి పండిస్తారు. కూరగాయలను ఫ్రీగా మాకు ఇస్తారు. మాకు చాలామందికి పని కల్పించారు. పండగలప్పుడు బట్టలు కూడా ఇస్తారు. ఏదైనా ఆపద వస్తే సాయం చేస్తారు. కూలీలను చాలా బాగా చూసుకుంటారు. మాతోపాటు నాటు వేస్తారు. ఆమె పనులు చేస్తూ.. మాతో చేయిస్తారు. మేడమ్ ఇక్కడ వ్యవసాయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు బాగా పని దొరుకుతోంది.
-స్థానికంగా పనిచేసే కూలీలు
ఇదీ చదవండి: numaish in hyderabad 2022: రేపటి నుంచే నుమాయిష్.. ఏర్పాట్లు పూర్తి