రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మృత్యుబావి కేసుకు సంబంధించి కేసు విచారణ మొదలైంది. ఈ ఏడాది మే 20న వరంగల్ గ్రామీణ జిల్లా గొర్లకుంట సమీపంలోని పాడుబడిన బావిలో... రెండు రోజుల్లో 9 మృతదేహాలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. పశ్చిమ బెంగాల్ నుంచి 20 ఏళ్ల క్రితమే కుటుంబంతో సహా వచ్చి వరంగల్‌లో స్ధిరపడి..గొర్రెకుంట గన్నీ సంచుల గోదాంలో పనిచేస్తున్న మక్సూద్, అతని కుటుంబసభ్యులు దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. మక్సూద్ ఇంటిపక్కనే నివాసముండే ఇద్దరు బిహారి యువకులు... మొత్తం 9 మంది పాడుబడిన బావిలో విగతజీవులుగా తేలడం అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది.
నిద్రమాత్రలు కలిపి మట్టుబెట్టాడు..
తొలుత ఆత్మహత్యలుగా భావించినా ఆ తరువాత ఇద్దరు బిహారీ యువకుల మృతదేహాలూ వెలుగుచూడడం వల్ల హత్యలుగా పోలీసులు నిర్ధారించారు. పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, క్లూస్ టీం, సాంకేతిక బృందం... ఇలా మొత్తం 6 బృందాలతో రాత్రింబవళ్లు దర్యాప్తు చేసి కేసును 72 గంటల్లోనే చేధించారు. బిహార్ నివాసి.. సంజయ్ కుమార్ యాదవే హత్యలన్నీ చేసినట్లు పోలీసులు నిర్ధారించి... అరెస్ట్ చేశారు. అనంతరం హత్యలకు గల కారణాలను పోలీసు అధికారులు మీడియాకు వెల్లడించారు. ఒక హత్యను కప్పిపుచ్చుకోవడానికి 9 మందిని హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. మక్సూద్ భార్య నిషా.. అక్క కూతురు రఫీకాతో సంజయ్ కుమార్ పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మోసం చేయడమే కాకుండా...నిడదవోలు వద్ద చున్నీతో గొంతు బిగించి చంపి రైల్లోంచి తోసి అతి దారుణంగా హతమార్చాడు. రఫీకా ఆచూకీపై మక్సూద్ భార్య నిషా సంజయ్‌ను ప్రశ్నించడం... పోలీసులకు చెబుతానని బెదిరించడం వల్ల వీరందరిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని భోజనంలో నిద్రమాత్రలు కలిపి కుటుంబాన్ని మట్టుబెట్టాడు. అపస్మారక స్థితిలో ఉండగానే అందరినీ ఈడ్చుకెళ్లి బావిలో పడేసి సామూహికంగా హతమార్చాడు.
నెలరోజుల్లోపే ఛార్జి షీట్
పాలుగారే చెక్కిళ్లతో ఉన్న మూడేళ్ల బాబును చూసైనా మనస్సు కరగక నిర్ధాక్షణ్యంగా బావిలో ఎత్తి పడేశాడు. సంజయ్ ఘాతుకానికి అమాయకులైన పది మంది వ్యక్తులు బలైనట్లు పోలీసులు తెలిపారు. హత్యల తాలూకు కీలకమైన ఫోరెన్సిక్ నివేదిక కూడా రావడంతో సరిగ్గా నెలరోజుల్లోపే పోలీసులు ఛార్జి షీట్ దాఖలు చేశారు. మృతులపై మత్తు ప్రయోగం జరిగినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. ఈ కేసుకు సంబంధించి జిల్లా మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి విచారణ ప్రారంభించారు. కొవిడ్ తరువాత జిల్లా కోర్టులో ప్రారంభమైన మొదటి కేసు విచారణ ఇదే. వరంగల్ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉంటున్న సంజయ్ కుమార్‌ను....కోర్టుకు హజరుపరిచారు. మొత్తం ఆరుగురు సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను న్యాయమూర్తి నమోదు చేశారు. వచ్చే నెల 7 వరకూ సాగనున్న విచారణలో మొత్తం 98 మంది సాక్షులను విచారించనున్నారు.
ఇవీ చూడండి: కోర్టులో గొర్రెకుంట సామూహిక హత్యల కేసు విచారణ