Gender determination test in Hanamkonda : హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు ఆడపిల్లలు. ప్రస్తుతం ఆ మహిళ మూడు నెలల గర్భవతి. 'మళ్లీ ఆడపిల్ల పుడితే ఇబ్బందులు పడతారు' అంటూ సమీప బంధువు ఓ ఆసుపత్రిలో పీఆర్వోను కల్పించాడు. పీఆర్వో హనుమకొండలోని ఓ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు జరిపించాడు. వైద్యురాలి వద్దకు తీసుకెళ్లగా, వైద్య పరీక్షలు నిర్వహించి గర్భంలో ఆడపిల్ల ఉందని తెలిపింది. బాధితుల వద్ద డబ్బులు తీసుకుని గర్భవతి అయిన మహిళకు ఇంటి వద్దనే ఓ వైద్యురాలు అబార్షన్ నిర్వహించింది. ఈ విషయం తెలుసుకున్న మండల వైద్యాధికారి పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు గుట్టు రట్టయింది. వైద్యాధికారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దామెరలో ఓ మహిళకు ఇష్టం లేకుండా లింగనిర్ధారణ పరీక్షలు చేయించిన బైకాని నాగరాజు, బండి నాగరాజు, కాయిత రాజు, కాశిరాజు దిలీప్, డా.సబిత, డా.బాల్నె పూర్ణిమపై కేసు నమోదు చేశారు.
Illegal Abortions in Hanamkonda : లింగనిర్ధారణ కేంద్రాలు, గర్భస్రావాలు చేసిన ఆసుపత్రులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి ఆడపిల్లలను కడుపులోనే కడతేర్చుతున్న ముఠా సభ్యుల గుట్టురట్టు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైద్యులు,ఏజెంట్లను, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నర్సంపేటకు చెందిన ప్రముఖ మహిళా వైద్యురాలు, నెక్కొండకు చెందిన ఒక వైద్యుడితోపాటు మరొకరిని అదుపులోకి తీసుకుని జరిపిన విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రూ. 50 వేల వరకు వసూలు : అక్రమంగా లింగ నిర్దారణ, అబార్షను విషయాల్లో పోలీసుల విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. నెక్కొండ, హనుమకొండ, నర్సంపేట, వరంగల్ తదితర ప్రాంతాల్లో అబార్షన్లు జరిగినట్లు గుర్తించారు. దీనికి ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తేలింది. ప్రధాన సూత్రధారి ఒకరు నగరంలో రెండు, మూడు ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకొని ఆడపిల్ల అని నిర్ధారించుకుని.. అబార్షను చేయిస్తున్నారు. ఈయనపై గతంలో కూడా ఇలాంటి కేసు నమోదైంది. ఈ ముఠాలోని కొంతమందిని కేయూ పోలీసులు అరెస్టు చేశారు. మరి కొందరి కోసం వెతుకుతున్నారు.
ఏజెంట్ల ద్వారా దందా : వైద్యులు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని లింగ నిర్ధారణ పరీక్షల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి గర్భిణులను నగరానికి తీసుకొస్తున్నారు. లింగనిర్ధారణ చేసిన ఆడపిల్ల అయితే అబార్షన్ కోసం మరో వైద్యుల వద్దకు పంపిస్తున్నారు. ఇలా చేసినందకుకు సదరు ఏజెంట్లకు పెద్ద మొత్తంలోనే నగదు ముట్టజెప్పుతున్నారు. ఇలా సుమారు 200 మందికి అబార్షన్లు చేయించి ఉంటారని పోలీసుల విచారణలో వెల్లడైందంటున్నారు. ఇలా అబార్షన్లు చేయించుకున్న మహిళలు ప్రస్తుతం ఎక్కడున్నారు, వారికేమైనా ఆరోగ్య సమస్యలొచ్చాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
18 మందిని అరెస్టు చేసిన పోలీసులు : వరంగల్ జిల్లాలో లింగనిర్ధరణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ధనార్జనే ధ్యేయంగా అమాయకులకు పరీక్షలు జరిపి వారి నుంచి నగదు వసూలు చేస్తున్నారని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. నర్సంపేట కేంద్రంగా పెద్దఎత్తున దందా జరుగుతోందని పేర్కొన్నారు. అక్రమ పరీక్షల నేపథ్యంలో లోటస్ ఆస్పత్రి యజమాని, వైద్యులను అరెస్టు చేసినట్లు తెలిపారు. స్కానింగ్ సామగ్రిని సైతం స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుల నుంచి 18 సెల్ ఫోన్లు, రూ.73 వేలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ రంగనాథ్ వెల్లడించారు.
ఇవీ చదవండి: