ప్రజాప్రతినిధుల అనుచరులే పనులు దక్కించుకుని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గాల అభివద్ధి పనులకు కేటాయించిన నిధుల వినియోగంలో పారదర్శకత లోపించిందని అన్నారు. అభివృద్ధి పనుల కోసం ఇచ్చే నిధులను ప్రభుత్వం ఏడాదికి రూ.3 నుంచి 5 కోట్లకు పెంచిందని వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ ఆమోదంతో సంబంధిత ఇంజనీర్లే పనులు చేయాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదని పద్మనాభ రెడ్డి ఆరోపించారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో మురికి కాల్వల నిర్మాణం కోసం రూ.54 లక్షల అంచనా వ్యయాన్ని ఇంజనీర్లు రూపొందించగా... 4.99 లక్షల ప్రాతిపదికన పనులను విభజించినట్లు తెలిపారు. అంతే కాకుండా తాను సూచించిన వాళ్లకే పనులు అప్పగించాలని నగర పంచాయతీ కమిషనర్‌కు సంబంధిత ఎమ్మెల్యే సూచించారని ఆయన ఆరోపించారు.
అలాగే సంగె మండలం బొల్లికుంట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం కేటాయించిన 67 లక్షల రూపాయల పనులను 14 భాగాలుగా విభజించి.. పార్లమెంటు సభ్యుడు సూచించిన విధంగా అధికారులు కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ఏటా రూ.800 కోట్లు కేటాయిస్తోందని వెల్లడించారు. నిధుల వినియోగంలో పారదర్శకత లోపించడం వల్ల ప్రజాప్రతినిధుల అనుచరులు, కార్యకర్తలకు ఉపాధిలా మారిందని పద్మనాభరెడ్డి విమర్శించారు. ఆ నిధులను జిల్లా పరిషత్, పురపాలికలకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు రాసిన లేఖలో ఆయన కోరారు.
ఇదీ చూడండి: FGG: 'భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి'