వరంగల్ జిల్లా పర్వతిగిరి మండల కేంద్రానికి చెందిన కుమారస్వామి... 25 ఏళ్లుగా తనకున్న 2 ఎకరాల భూమి సాగు చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఈ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారని వాపోయాడు. పర్వతగిరిలో 250 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉందని... అయినా సరే అధికారులు ఉద్దేశపూర్వకంగా తన భూమిని కేటాయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పెళ్లికి ఎదిగిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని... వారికి పెళ్లి చేయాలనుకుంటున్న తరుణంలో ప్రభుత్వం తన భూమిని లాక్కుందని వాపోయాడు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
బిడ్డల పెళ్లిళ్ల కోసం ఆర్థిక సాయం చేసి భూమిని తీసుకోవాలని లేదంటే మరో ప్రాంతంలో భూమిని కేటాయించాలని కుమారస్వామి కోరుతున్నాడు. తన భార్యకు క్యాన్సర్ ఉందని.. తల్లిదండ్రులను, తోబుట్టువును చూసుకోవాల్సిన బాధ్యత తనపైనే ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ముగ్గురు పిల్లలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని... తమను జీవనధారమైనా వ్యవసాయ భూమిని లాక్కుని పొట్ట కొట్టొద్దని బాధితులు వేడుకొంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వేడుకొంటున్నారు.
అది అసైన్డ్ భూమి
ప్రభుత్వ అసైన్డ్ భూములను ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటుందని.. దానిపై ఎవరికి ఎలాంటి అధికారాలు ఉండవని పర్వతగిరి ఎమ్మార్వో మహబూబ్ అలీ తెలిపారు. అసైండ్ భూమిలో ఎన్ని ఏళ్లు కస్తూ చేసుకున్నా... చివరికి అది ప్రభుత్వానికే చెందుతుందని.. అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆయన తెలిపాడు. రైతు కుమారస్వామి భూమి విషయంలో అదే జరిగిందని అంతా ప్రభుత్వం నిబంధనలమేరకే భూమి స్వాధీనం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఆర్డీవో ఆదేశాలతో మరో ప్రాంతంలో భూమి ఇచ్చేందుకు ఆలోచిస్తున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Murder : తల్లీకూతుళ్ల దారుణ హత్య.. అల్లుడే హంతకుడు!