Minister Errabelli comments on KCR: తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు చురుకుగా ఉండే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఇవాళ వరంగల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తరువాత తానే సీనియర్ అంటూ చెప్పుకొచ్చారు. గత 30 ఏళ్లుగా వరుస విజయాలతో సీనియర్ ఎమ్మెల్యేగా రాజకీయాల్లో నెగ్గుతున్నానని అన్నారు.
వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న 1987-1988 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఏ రంగంలోనైనా రాణించాలంటే.. కృషి పట్టుదల అవసరమని తోటి స్నేహితులు, సన్నిహితులకు హితబోధ చేశారు. తాను డాక్టర్ అవ్వాలనుకునేవాడినని.. కానీ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. క్రీడల్లోను ఎప్పుడు ముందుండే వాడినని అని తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
Senior after KCR Comments by Errabelli Dayakar: ఇకపోతే తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మంత్రి ఎర్రబెల్లి సీఎం కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆయన తన తండ్రి పోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తన తండ్రి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 2016లో టీఆర్ఎస్లోకి వచ్చిన ఎర్రబెల్లి.. 2019లో సీఎం కేసీఆర్ రెండో దఫా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. ఎప్పుడూ ఎదో ఒక సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలిచే ఎర్రబెల్లి దయాకర్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ హయాంలో చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగేవారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన వంతు ఎంతో కృషి చేశారు.
"తెలంగాణలో రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తరువాత నేనే సీనియర్.. మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. ఒకసారి ఎంపీగా గెలిచా.. నా చిన్నతనం నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. ఎన్నో అవార్డులు తీసుకున్నా.. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అవన్నీ బంద్ చేశా. ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తున్నాను. ప్రజల ఆదరణ, అభిమానంతో గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో రాణిస్తున్నాను. ఈ రంగంలోకి మా నాన్న పోత్సాహంతో వచ్చా. ఏ రంగంలోనైనా రాణించాలంటే కసి ఉండాలి.. నేనే ఎందుకు విజయం సాధించలేననే కసి ఉండాలి. పట్టుదలతో కృషి చేస్తే విజయం తప్పక వస్తోంది."- ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
ఇవీ చదవండి:
మహిళలకు మంత్రి ఎర్రబెల్లి షాక్.. ఏం జరిగిందంటే..!
కవితపై బండి సంజయ్ వ్యాఖ్యల్ని సమర్థించను: ఎంపీ అర్వింద్