Delay Rains Telangana : రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యంతో ఆందోళన పడ్డ రైతులు రెండ్రోజులు వానలు కురవగానే సంబురపడ్డారు. ఆలస్యమైనా సరే అన్యాయం చేయకుండా వర్షాలు వచ్చాయని సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. జూన్ నెల ముగియడానికి వస్తున్నా అంతంత మాత్రంగానే వర్షాలు పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Telangana Rains updates : ఈ ఏడాది రుతుపవనాల ఆలస్యంతో ఇప్పటికే సాగు పనులు ఆలస్యమైతే జోరుగా వానలు కురవక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు పెట్టి ఆశగా వానల కోసం ఎదురుచూస్తున్నారు. జూన్ తొలి వారంలోనే నైరుతి రుతుపవనాలు రావాల్సి ఉన్నా మూడో వారం వరకు జాడే లేకుండాపోయింది.
ఆ తర్వాత రుతుపవనాలు వచ్చినా ఓ మోస్తరు జల్లులు కురిశాయి తప్ప.. జోరు వానలు కురవలేదు. వర్షాలు జోరుగా పడతాయన్న నమ్మకంతో దుక్కి దున్ని విత్తనాలు పెట్టి వర్షం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. వారంరోజులుగా వాతావరణం చల్లబడినా సరైన స్థాయిలో వర్షం కురవకపోవడంతో విత్తనాలు పెట్టిన రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. రుతుపవనాల ఆలస్యం పంటలసాగుకు ఆటంకంగా మారింది. వర్షాభావంపై ఆధారపడి సాగుచేసే కర్షకులు పెట్టిన విత్తనాలు ఎండిపోయి 10 నుంచి 20 వేల మేర నష్టాన్ని చవిచూశామని చెపుతున్నారు.
'ఒకసారి విత్తనాలు వేశాం. వర్షాలు రాక అవి మొలకెత్తలేదు. రెండోసారి విత్తనాలు విత్తినప్పుడు వర్షాలు మోస్తరుగా కురిసి ఆగిపోయాయి. వాతావరణం ఇలానే ఉంటే పెట్టుబడి అంతా నష్టపోతాం. ఇది వరకు విత్తనాలు వేసేటప్పుడే 30 వేలు నష్టపోయాం మళ్లీ ఈసారి వర్షాలు రాకపోతే మాకు మరింత నష్టం జరుగుతుంది. మాకు బోర్లు కూడా లేవు వర్షాల పైనే ఆధారపడి ఉన్నాం.' - బాధిత రైతులు
మూడోవారం మొదట్లో వర్షాలు కురిసినా ఆతర్వాత వానజాడ కనిపించపోవడంతో మరోసారి నాటిన విత్తనాలు ఎండిపోయే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. గతేడాది ఈ సమయంలో పత్తిచేలలో కలుపుతీయడం, ఎరువులు వేయడం వంటి పనుల్లో రైతులు నిమగ్నమై ఉన్నారు. కానీ ఈసారి ఇంకా విత్తన దశలోనే ఉండిపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు రాక పెట్టిన విత్తనాలు మొలకెత్తతాయా మళ్లీ ఎండిపోతాయా అన్న ఆందోళనతోనే రోజులు వెళ్లదీస్తున్నారు. సరైన స్థాయిలో వర్షాలు కురవకపోతే సాగు మరింత జాప్యమయ్యే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.
ఇవీ చదవండి: