జనగామ జిల్లాలో కరోనా భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఆదివారం ఒక్కరోజే జిల్లాలో అత్యధికంగా 34 కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా యాక్టివ్ కేసులు 59కి చేరుకున్నాయి. జనగామతో పాటు నర్మెట్ట, బచ్చన్నపేట, లింగాల ఘన్‌పూర్, రఘునాథపల్లి, దేవరుప్పల మండలాల్లో కేసులు నమోదయ్యాయి. జనగామలోని ఎరువుల దుకాణం యజమాని, ఇతర భాగస్వాములు, వారి కుటుంబసభ్యుల్లో 25 మందికి పాజిటివ్‌గా నిర్ధరించారు. ప్రాథమిక సంబంధికులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
జనగామ జిల్లాలో కరోనా వ్యాప్తిపై దృష్టిసారించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు... కలెక్టర్, వైద్యాధికారులతో సమీక్షించారు. వైరస్‌ను కట్టడిచేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. స్వీయ నియంత్రణ, క్వారంటైన్‌ను మరింత పకడ్బందీగా అమలు పరచాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.
సాయంత్రం 4గంటలకే షాపుల మూసివేత
క్రమంగా కేసులు పెరుగుతుండటంతో జనగామలోని వ్యాపారులు సైతం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాయంత్రం నాలుగు గంటలకే దుకాణాలు మూసేసి స్వచ్ఛంద లాన్‌డౌన్ పాటించాలని నిర్ణయించారు. ఈ నెల 30 వరకు పూర్తి బంద్ పాటిస్తామని బంగారం, వస్త్రాల వ్యాపారులు ప్రకటించారు.
ఇప్పటివరకు 11 మంది వైద్యులకు కొవిడ్
వరంగల్ పట్టణ జిల్లాలోనూ కరోనా కేసులు అధిమవుతున్నాయి. పీజీ విద్యార్థులు ఆరుగురితో కలిపి మొత్తం 11 మంది డాక్టర్లు వైరస్ బారిన పడ్డారు. బ్రాహ్మణవాడ, కాజీపేట దర్గాలో కేసుల సంఖ్య ఎక్కువవుతోంది. లాక్‌డౌన్ సడలింపుల తరువాత ఇప్పటి వరకు 42 మందికి పాజిటివ్ అని తేలింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ర్యాండమ్ టెస్టులు జరిపి.. పాజిటివ్ వస్తే.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చికిత్సలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
వైరస్ నియంత్రణకు ప్రతిఒక్కరూ మాస్కులు తప్పని సరిగా వాడాలని అధికారులు సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటించడంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
ఇవీ చూడండి: శత్రువులు చుట్టుముట్టినా... సింహంలా గర్జించాడు..!