Labour shortage: రాష్ట్రంలో అన్నదాతలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం, వాతావరణ అనుకూల పరిస్థితులతో చాలాచోట్ల గతంలో కూలీలుగా ఉన్న వారంతా రైతులుగా మారారు. బీడువారిన భూముల్లో కాసుల పంటలు పండుతున్నాయి. భగ్గుమంటున్న పెట్రో, డీజిల్ ధరలు, పెరిగిన డిమాండ్‌తో పొలం దున్నే ట్రాక్టర్లతో పాటు వరి నాట్లు వేసే, కోతలు కోసే యంత్రాల కిరాయిలు సైతం భారీగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ పనులకు కూలీల కొరత అన్నదాతలను తీవ్రంగా వేధిస్తోంది. స్థానికంగా కూలీలు దొరకటం కష్టతరంగా మారటంతో... ఏజెంట్లను ఆశ్రయిస్తున్న అన్నదాతలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలతో పనులు చేయించుకుంటున్నారు.
ఎకరానికి 4 వేలు..
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తిలోని వ్యవసాయ పొలాల్లో నాట్లు వేసేందుకు బంగాల్ నుంచి కూలీలు వచ్చారు. పలువురు ఏజెంట్ల సహకారంతో బెంగాల్‌కు చెందిన మగకూలీలను మాట్లాడుకున్న రైతులు.... వీరికి పనులను అప్పగిస్తున్నారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ కూలీల బృందం.... నాట్లు వేసేందుకు ఎకరానికి 4వేల రూపాయలు తీసుకుంటున్నారు. స్థానిక కూలీల కంటే వీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ పనిచేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
అడ్వాన్సులిచ్చి బుకింగ్..
తెలంగాణవ్యాప్తంగా వ్యవసాయ పనులు పెద్దఎత్తున సాగుతున్నాయని.... తమ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేనందునే ఇక్కడికి పనులను వెతుక్కుంటూ వచ్చినట్లు బంగాల్ నుంచి వచ్చిన కూలీలు చెబుతున్నారు. ఇక్కడ పనికి తగిన కూలీ డబ్బులు అందుతున్నట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఒకే రోజు ఎక్కువ పనిచేస్తున్నందున... బంగాల్ కూలీలకు పెద్దఎత్తున డిమాండ్ పెరిగింది. దీంతో ముందస్తుగా అడ్వాన్సులు ఇస్తూ కూలీ పనుల కోసం వీరిని రైతులు బుక్ చేసుకుంటున్నారు.
ఇదీ చూడండి: