వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలోని గాలయ్య, వెంకటమ్మలకు ఇద్దరు సంతానం. అందరిలాగే తమ పిల్లలు కూడా పేదరికంతో ఇబ్బందులు పడొద్దని, మంచి ఉద్యోగం చేసి ఆనందంగా ఉండాలని భావించారు. చిన్న హోటల్ నడుపుతూ.. కష్టపడి పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. వారి కలలు నిజం చేసేలా పిల్లలు కూడా బాగా చదివేవారు. కొడుకు ఇంజినీరింగ్ పూర్తి చేసి బ్యాంకులో ఉద్యోగం చేస్తుండగా.. కూతురు యామిని ఎంసెట్‌లో ర్యాంకు సాధించింది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హోంసైన్స్ విభాగంలో సీటు సంపాదించి హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ హోమ్ సైన్స్ కోర్సును ఎంపిక చేసుకుంది. 2019లో కోర్సు పూర్తి చేసిన యామిని నాలుగేళ్లలో మంచి గ్రేడ్స్ సాధించింది.
ఆమె సాధించిన మార్కుల ఆధారంగా యామినికి విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 3న బంగారు పతకాన్ని ప్రకటిస్తూ.. డా.ఇరరెడ్డి నగదు పురస్కారానికి ఎంపిక చేసింది. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్‌లో హోమ్ సైన్స్ పూర్తి చేసిన అనంతరం యామిని(ఎంఎస్సీ) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐ సీఏఆర్) పరీక్ష రాసింది.
అందులో అఖిల భారత స్థాయిలో 20వ ర్యాంక్ సాధించి ప్రస్తుతం కర్ణాటకలోని ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ చదువుతోంది. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత గ్రామీణ స్థాయిలోని మహిళలకు, చిన్నారులకు తన వంతు సేవ చేసేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుందని, గ్రామీణ స్థాయిలో నిరుపేదలకు సేవలందించేందుకే తాను ఈ కోర్సు తీసుకున్నానంటోంది యామిని. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్ లో బంగారు పతకం సాధించిన యామినికి స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పర్యవేక్షణాధికారిగా ఉద్యోగం వస్తుందని ఆమె తల్లిదండ్రులు ఆశాబావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న ప్రభాస్