కానాయపల్లి శంకర సముద్రం రిజర్వాయర్ బాధితులకు దశలవారీగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి... కానాయపల్లి పునరావాసం పునర్నిర్మాణ సమస్యపై నీటిపారుదల, రెవెన్యూ అధికారులు, గ్రామస్థులతో సమీక్ష నిర్వహించారు. రిజర్వాయర్ పూర్తిగా నింపితే... 350 ఇళ్లు కోల్పోతారని గుర్తించడం జరిగిందని... ముందుగా వీరందరికి దశలవారీగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు.
బాధితులకు సౌకర్యాల కల్పన, న్యాయం చేసే విషయమై ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ముందు నోటీసులు జారీ చేసి తగినంత సమయం ఇచ్చాకే గ్రామాన్ని ఖాళీ చేయిస్తామన్నారు. ఇదివరకే కేటాయించిన లేఔట్ ప్రకారం బాధితులు వారంతకు వారే ఎక్కడుండలో ప్లాట్లు ఎంచుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కానాయపల్లి పునరావాసం, పునర్నిర్మాణం సమస్యలను మరో సారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. పూర్తి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.