తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్యకు యత్నించిన యువకున్ని పోలీసులు కాపాడారు. వనపర్తికి చెందిన అబ్దుల్ షమీం చెడు తిరుగుళ్లు మానుకోవాలంటూ తల్లిదండ్రులు మండిపడ్డారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు. నాగవరం అమ్మ చెరువులో పడి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.
చెరువు వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకునే క్రమంలో అటుగా వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తులు వనపర్తి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అబ్దుల్‌కు నచ్చజెప్పి... ఆత్నహత్యాయత్నాన్ని విరమింపజేశారు. యువకుడి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుమారున్ని తల్లిదండ్రులకు అప్పగించారు.