వివిధ ఎత్తిపోతల పథకాల కింద పెండింగ్లో ఉన్న భూసేకరణ, పునరావాస కేంద్రాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఆదేశించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయా ప్రాజెక్టుల ఇంజినీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులతో పునరావాస కేంద్రాలు, భూసేకరణపై సమీక్ష నిర్వహించారు.
పాలమూరు - రంగారెడ్డి, రాజీవ్ భీమా, మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకాల కింద దాదాపుగా భూసేకరణ పూర్తయిందని, అయితే పెండింగ్లో ఉన్న చోట త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు పనులు చేపట్టి సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా భూసేకరణ పనులు ఎందుకు పెండింగ్లో ఉండాల్సి వచ్చిందో ఆయా ప్రాజెక్టుల వారీగా సమస్యలపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
కొంకలపల్లి, బండరావిపాకుల, నాగరాల తదితర పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకించి ఖానాయపల్లి పునరావాస కేంద్రంలో బాధితులకు పరిహారంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పటికీ గ్రామస్థులు ఇంకా గ్రామాన్నీ ఖాళీ చేయకపోవడంపై విచారణ నిర్వహించాలని ఆమె రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ డి.వేణు గోపాల్, ఆర్డీవో చంద్రారెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు, తహసీల్దారులు, తదితరులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: 'ఎస్సై నన్ను మోసం చేశాడు'... 'కాదు ఎస్సై మోసపోయాడు'