Villagers are worried in Puligutta: మైనింగ్ పనులను నిలిపివేయాలని కోరుతూ వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పులిగుట్ట ప్రాంతంలోని సమీప గ్రామస్థులు చేసిన ర్యాలీ ఆందోళనలకు దారి తీసింది. ఉదయం నుంచి వందలాది మహిళలు, గ్రామస్థులు, యువకులు పులిగుట్ట వద్ద నిరసన ర్యాలీ ప్రారంభించి గుట్ట వరకు ప్రశాంతంగా చేరుకున్నారు. అక్కడ మైనింగ్ పనుల కోసం గుత్తేదారు చేపట్టిన పనులు, గుట్ట పక్కనే మైనింగ్‌కు ఉపయోగించే వాహనాలు చూసి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో వారి ఆవేశం కట్టలు తెంచుకోవడంతో క్యాంపులో ఉన్న ట్రాకర్లు, జేసీబీ, టిప్పర్లపై రాళ్లు రువ్వారు. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న తాత్కాలిక షెడ్డుకు నిప్పంటించారు. కంటైనర్‌ను ఎత్తిపడేశారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై నాగశేఖర రెడ్డి, వారి సిబ్బంది ఆందోళనకారులను నిలువరించేందుకు ప్రయత్నించగా.. ఆందోళనకారులు వారి మాట వినకుండా ముందుకు దూసుకెళ్లారు. ట్రిప్పర్లకు నిప్పు పెట్టేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఒక దశలో పోలీసుల చేతిలో ఉన్న చరవాణులను ఆందోళనకారులు తీసుకున్నారు. "ప్రాణాలైన అర్పిస్తాం.. కాని తాత, ముత్తాతల కాలం నుంచి మాకు జీవనాధారంగా ఉన్న పులిగుట్టను మాత్రం వదిలి పెట్టుకోమని నినాదాలు చేశారు." తక్షణమే పనులు నిలిపివేయాలని గ్రామస్తులు పట్టుబట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న తహశీల్దార్ బాల్ రెడ్డి గ్రామస్థులతో చర్చలు జరిపారు.
అయితే ఆందోళనకారులు.. జిల్లా కలెక్టర్ తక్షణం రావాలని.. తమ సమస్యను పరిష్కరించాలని పట్టుబట్టారు. చివరికి తహసీల్దార్ బాల్ రెడ్డి, ఎస్సై నాగశేఖరరెడ్డి మరోమారు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళనను విరమించారు. బాధితులకు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగంధర్ గౌడ్, బీజేపీ నాయకులు భరతభూషణ్, బాలమణేమ్మ, కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి మద్దతు తెలిపారు.
"మా పూర్వికులు నుంచి ఈ గుట్టను ఆధారం చేసుకునే బతుకుతున్నాం. మా గొర్రెలు, పశువులు ఇక్కడే మేతకు వదులుతాం. ఇప్పుడు ఈ గుట్టును తవ్వేస్తే ఎట్టా బతకాలి మేము. మా ప్రాణాలైనా అర్పిస్తాం గానీ ఈ పోరాటం మాత్రం విడిచిపెట్టాం. అధికారులు వెంటనే స్పందించి మైనింగ్ పనులు ఆపాలి. లేకుంటే ఆందోళన మరింత తీవ్రంగా ఉంటుంది".- ఆందోళనకారులు
ఇవీ చదవండి:
రణరంగంగా గన్నవరం.. ఆయుధాలుగా మారిన కర్రలు, రాళ్లు
'ప్రైవేట్ పార్ట్స్, గుండెను చీల్చి.. యువతికి, ఫ్రెండ్స్‌కు ఫొటోస్ పంపాడు'
వైద్య విద్యార్థిని ఆరోగ్యంపై ఈటల ఆరా.. ప్రభుత్వానికి మూడు డిమాండ్లు