Gravyyard Fight: వనపర్తి జిల్లా అమరచింత పురపాలిక కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్మశాన వాటిక వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో తెరాస, భాజపా కార్యకర్తలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. జూన్ 2న పట్టణ ఆటస్థలం ఏర్పాటుకు సర్వే నెంబర్ 650, స్థానిక 7వ వార్డులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని తహసీల్దార్ మున్సిపాలిటీ అధికారులకు అప్పగించారు. ఆ స్థలంలో గత రెండు రోజులుగా చదును చేసే పనులను అధికార పార్టీ కౌన్సిలర్ చేపడుతున్నారు.
ఇదే క్రమంలో సోమవారం రాత్రి పని చేయించేందుకు వెళ్లిన కౌన్సిలర్‌ను భాజపా నాయకులు... శ్మశాన వాటిక స్థానంలో పార్క్ నిర్మాణం చేపట్టడం సరైంది కాదని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న శ్మశాన వాటికను తొలగించవద్దని ప్రశ్నించడంతో ఇరు వర్గాలు దాడులకు పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలంలో దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకొచ్చింది. దాని ఆధారంగా దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి తగిన న్యాయం చేయాలని భాజపా శ్రేణులు డిమాండ్ చేశాయి. అమరచింత పట్టణ కేంద్రంలో నినాదాలు చేస్తూ పురవీధుల్లో తిరిగారు.
ఆ స్థలంలో పద్మశాలి కుటుంబీకుల సమాధులు ఉన్నాయని వాటి ఆనవాలు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని భాజపా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కొంత స్థలాన్ని శ్మశాన వాటికకు వదిలి మిగిలిన దాంట్లో క్రీడాస్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. వారికి భాజపా నాయకులు మద్దతు తెలపగా అధికాస్త పెద్ద వివాదంగా మారింది. ఆ స్థలాన్ని శ్మశాన వాటికకు కేటాయించి... అక్కడ క్రీడాస్థలం ఏర్పాటు చేయొద్దని భాజపా నాయకులు పట్టుబట్టారు. చివరకు పరస్పర గొడవలకు దారితీశాయి.
ఇవీ చూడండి: