సర్కారు ఉద్యోగి అయిన శ్రీకాంత్‌రెడ్డికి 25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందరి రైతులలాగానే వరి, వేరుశేనగ, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలు కాకుండా.. ఉద్యాన సాగుపై దృష్టి పెట్టారు. మామిడి, సఫోటా, జామ సాగు చేస్తున్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారుల సహకారంతో సీతాఫలం సాగు చేపట్టారు. నాలుగు ఎకరాల క్రితం వేసిన తోట.. ఇప్పుడు లాభాలను ఇస్తోంది. మిగతా రైతులకూ శ్రీకాంత్‌రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారు.
సీతాఫలాలు విక్రయించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉందని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కేవలం గంటలోనే పండ్లను అమ్ముకోవచ్చన్నారు. ఎకరాకు 25 వేలు పెట్టుబడి పెడితే దాదాపు 2 లక్షల రూపాయలకుపైగా ఆదాయం పొందవచ్చని వివరించారు. మేలు రకమైన సీతాఫలంలో చక్కెరశాతం తక్కువగా ఉండటం వల్ల మధుమేహులు కూడా తినొచ్చని తెలిపారు. తాను పండించిన సీతాఫలాల్లో 9 నుంచి 10 గింజలు మాత్రమే ఉంటాయని మొత్తం గుజ్జు ఉండటం వల్ల అందరూ ఇష్టపడతారని చెప్పారు.
రైతులు సాధారణ పంటలు కాకుండా పండ్ల తోటల వైపు దృష్టిసారిస్తే అధిక దిగుబడితో పాటు లాభాలు సాధించవచ్చని శ్రీకాంత్‌రెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలతో మరో 30 వేల ఆదాయం వస్తుందంటున్నారు.
"25 ఎకరాల్లో మామిడి, సఫోటా, జామా సాగు చేస్తున్నాను. సీతాఫలం మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలుసుకొని సాగు చేశాను. విత్తనాలను సోలాపూర్‌లో ఎన్ఎమ్కె1 రకానికి చెందిన విత్తనాలు తెచ్చుకొని పంట వేశాను. ఇప్పుడు సీతాఫలం ఒకటి కనీసం రూ.50లకు పోతుంది. నాణ్యత బాగుంటే రూ.80 కూడా వెళ్తుంది. సంవత్సరానిక రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నాను."-శ్రీకాంత్‌రెడ్డి, రైతు
ఇవీ చదవండి: