వనపర్తి జిల్లాలోని ఖిల్లాగణపురం, శ్రీరంగాపురం, పాన్‌గల్, వనపర్తి తదితర ప్రాంతాల్లోని పురాతన కట్టడాలు, ప్రదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పర్యటకంగా అభివృద్ధి చేయడానికి పూనుకొంది. ఇటీవల పాన్‌గల్ ఖిల్లాను సైతం పర్యటకంగా అభివృద్ధి చేయడానికి కసరత్తు ప్రారంభించిన అధికారులు నివేదికలు తయారుచేసే పనిలో ఉన్నారు. జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి చొరవతో 2017 నవంబరులో హైదరాబాద్ పురావస్తుశాఖ బృందాలను పురమాయించడంతో వారు ఖిల్లా కోటపై వారం రోజుల పాటు ఉన్నారు. గుట్టపై నున్న ఆనాటి కట్టడాలు, శిథిలావస్థలోని నిర్మాణాలు, ట్రెక్కింగ్‌కు అనుకూలమైన ప్రదేశాలు తదితర వాటిని తిరిగి పరిశీలించి నివేదికను కలెక్టర్‌కు అందించారు. వారి చొరవతో కలెక్టర్ సైతం గుట్టపై స్వయంగా ట్రెక్కింగ్ చేశారు. అనంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పర్యటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. మండల కేంద్రం శివారులోని ప్రదేశాలను పర్యటకంగా అభివృద్ధి చేస్తారనే ప్రచారంలోకి రావడంతో పర్యటకులు గుట్టపైకి తరలిరావడం గణనీయంగా పెరిగింది.
కొనసాగుతున్న తాకిడి..
ఖిల్లాగుట్టపై కాకతీయుల నాటి నిర్మాణాలు, పురాతన కట్టడాలు, ప్రదేశాలను వీక్షించేందుకు సెలవుదినాల్లో పర్యటకులు విరివిగా సందర్శిస్తున్నారు. కాకతీయుల కాలంలో నిర్మించినట్లు చెబుతున్న ఎంతో ప్రసిద్ధిచెందిన భవన నిర్మాణాలు, గుట్టచుట్టూ రాళ్లతో ఏర్పాటు చేసిన మెట్లు, ఎత్తయిన ప్రహరీలు, చిన్నచిన్న చెరువులు, గచ్చుతో నిర్మించిన నీటికుంటలు, గుట్టపైన చివరిభాగాన రాగితో రూపొందించిన పది అడుగుల ఫిరంగి, మరో చోట చీకటి గుండం, గణపసముద్రం చెరువు, ఆ సమీపంలోని అలీపేటగుట్ట వద్దనున్న శివాలయం తదితర ప్రదేశాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నేటికీ చుట్టుపక్కల గ్రామాలు, ఇతర మండలాలు, హైదరాబాద్ వంటి నగరాల విశ్వవిద్యాలయ, కళాశాలలకు చెందిన అనేకమంది విద్యార్థులు శని, ఆదివారాలు, ఇతర సెలువు దినాల్లో వచ్చి సందర్శిస్తున్నారు. 1976లో పురావస్తుశాఖ పరిధిలోకి తీసుకొని అభివృద్ధి చేయాలని భావించారు. 2017 నవంబరులో అటవీ ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఆశయంతో వీటిని అటవీశాఖ వారి పరిధిలోకి తీసుకొని అభివృద్ధికి బాటలు వేయడానికి ముందడుగు వేసింది. అయినా నేటికీ పర్యటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం శ్రద్ధ కనబర్చకపోవడం వల్ల పర్యటకులు నిరాశకు లోనవుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వం దృష్టి పెట్టాలి..
ఖిల్లాగుట్టపై ఉన్న అనేక కట్టడాలను పర్యటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామ సర్పంచి వెంకటరమణ తెలిపారు. ఏళ్ల చరిత్ర కలిగిన ఖిల్లాగుట్టపైనున్న ఆనవాళ్లు, నిర్మాణాలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు.
అభివృద్ధి చేయాలి..
ఖిల్లాగుట్టపై కాకతీయుల కాలంనాటి నిర్మాణాలను అభివృద్ధి చేయాలని గ్రామస్థుడు పట్టాభి రాములు డిమాండ్ చేశాడు. ప్రభుత్వం దృష్టి సారించి ఖిల్లాగుట్టను పర్యటకంగా అభివృద్ధి చెందేలా చేయాలని కోరారు.
కలెక్టర్ ద్వారా నివేదిస్తాం..
ఖిల్లాగణపురం గుట్టపైనున్న పురాతన కట్టడాలు, నిర్మాణాలను కాపాడాలనే దృష్టితో పర్యటక కేంద్రంగా మార్చాలనే ప్రతిపాదన రెండేళ్లుగా ఉందని జిల్లా అటవీశాఖ అధికారి బాబ్జీరావు వెల్లడించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో నివేదికను తయారు చేయడానికి కలెక్టర్ మాకు కొన్ని సూచనలు చేశారని తెలిపారు. వాటిని దృష్టిలో పెట్టుకొని రూపొందించే నివేదికను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించి అనుమతులు వచ్చిన వెంటనే అభివృద్ధికి కృషిచేస్తానని బాబ్జీరావు తెలిపారు.
ఇవీ చూడండి: నేడే కేబినెట్ సమావేశం