వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జగత్ పల్లి గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ప్రారంభించారు. మొదటి, రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాలలో పారిశుద్ధ్యం విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. వర్షాకాలంలో తాగునీరు కలుషితం కావడం, మురికి కాలువలో చెత్త పేరుకుపోవడంపై సిబ్బంది దృష్టి పెట్టాలన్నారు. మురుగు నీటి నిల్వ వల్ల డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు వస్తాయని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులు నిర్మూలించేందుకు పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టినట్లు స్పష్టం చేశారు. తడి, పొడి చెత్త వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
మొక్కలు నాటి.. సంరక్షించాలి..
మొక్కల పెంపకం ప్రతి పౌరుడు నైతిక బాధ్యతగా తీసుకొని.. నాటిన తర్వాత సంరక్షించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రతి శుక్రవారం గ్రామంలో డ్రైడే నిర్వహించి ఇళ్లలో ఉన్న నిల్వ నీటిని తొలగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రజలు 60 శాతం ఆదాయాన్ని ఆరోగ్యం పైన ఖర్చు చేస్తున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఇదీ చూడండి: జూన్ 2న తెలంగాణ డిమాండ్స్ డే: సీపీఐ కార్యదర్శి భూమన్న