వనపర్తి జిల్లాలో వేరుశనగ పంటకు మంచి డిమాండ్ ఏర్పడింది. వనపర్తి వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం క్వింటా పల్లి ధర గరిష్ఠంగా రూ.7,971 పలికింది. నాణ్యమైన పంటకు గత వారం రోజులుగా రూ. 7వేలకు పైనే ధర పలుకుతూ వస్తోంది. రోజురోజుకూ ధరలు క్రమంగా పెరుగుతుండటం రైతులకు ఊరటనిస్తోంది. రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో పలికిన రేటు కంటే వనపర్తి మార్కెట్లోనే అత్యధికంగా ధర పలుకుతుండటం గమనించాల్సిన అంశం. గత ఐదేళ్లుగా వనపర్తి వ్యవసాయ మార్కెట్‌లో జనవరి మాసంలో వేరుశనగకు దక్కిన గరిష్ఠ ధరల కంటే 2021 జనవరిలోనే అత్యధిక ధర వచ్చింది.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.5,275 కాగా.. అధిక ధరలు పలకడం వల్ల తమకు గిట్టుబాటు అవుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో.. వర్షాలకు పంటలు దెబ్బతిని, తెగుళ్లు సోకి, పెట్టుబడులు అధికమయ్యాయని, దిగుబడులు సైతం తగ్గాయన్నారు. ఈ సమయంలో ధర ఎక్కువ పలకడం తమకు కలిసివస్తోందన్నారు.
20-01-2021న వివిధ మార్కెట్లలో నమోదైన వేరుశనగ గరిష్ట ధరలు ( క్వింటాకు)
సూర్యాపేట | రూ. 6,855 |
మహబూబ్నగర్ | రూ. 6,871 |
కే సముద్రం | రూ. 6,918 |
వరంగల్ | రూ. 7,200 |
వనపర్తి | రూ.7,971 |
- వనపర్తి మార్కెట్‌లో వారం రోజుల పల్లీ ధరలు ( క్వింటాకు)
తేదీ | గరిష్ఠం | కనిష్ఠం |
20-01-2021 | రూ.7971 | రూ.4529 |
18-01-2021 | రూ.7942 | రూ.4689 |
17-01-2021 | రూ.791 | రూ.4759 |
16-01-2021 | రూ.7510 | రూ.4909 |
11-01-2021 | రూ.7733 | రూ.4405 |
- ఐదేళ్లలో వనపర్తి మార్కెట్‌లో జనవరి మాసంలో వేరుశన గరిష్ఠ ధరలు
సంవత్సరం | ధర |
2016 | రూ. 6090 |
2017 | రూ. 6,602 |
2018 | రూ. 4,944 |
2019 | రూ. 6,138 |
2020 | రూ. 5,850 |
సాగువిస్తీర్ణం, దిగుబడుల తగ్గడమే ప్రధాన కారణం..
గత ఏడాదితో పోల్చితే వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గడం, ఉత్పత్తి సైతం గణనీయంగా పడిపోవడమే ధరలు పెరిగేందుకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. సాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండటం, పల్లికి తెగుళ్ల బెడద, పెట్టుబడి అధికమవుతుండటంతో ఎక్కువ మంది రైతులు వరి వైపునకు మొగ్గు చూపారు. సాగు చేసిన వేరుశనగ సైతం విత్తనం వేసిన తొలినాళ్లలోనే కురిసిన.. భారీ వర్షాలకు దెబ్బతింది. తెగుళ్లు సోకి పురుగు మందుల ఖర్చులు ఎక్కువయ్యాయి. దిగుబడి సైతం ఎకరాకు సుమారు 10 క్వింటాళ్లు రావాల్సి ఉండగా.. ఐదారు క్వింటాళ్లే వచ్చింది. ఫలితంగా వనపర్తి మార్కెట్కు నిత్యం 20 నుంచి 25 వేల బస్తాల వరకూ రావాల్సిన పల్లీ 10 నుంచి 15 వేల బస్తాలకే పరిమితమైంది. అందువల్లనే డిమాండ్ పెరిగి.. అధిక ధర పలుకుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
యూరోపియన్ దేశాలకూ ఎగుమతి..
రాష్ట్రవ్యాప్తంగా సాగయ్యే పల్లితో పోల్చితే వనపర్తి సహా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పండిన వేరుశనగకు నాణ్యమైనదిగా పేరుంది. వనపర్తి మార్కెట్‌లో కొనుగోలు చేసిన పల్లిని యూరోపియన్ దేశాలకూ ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడ పంటలో అఫ్లోటాక్సిన్ అనే శిలీంద్రం ఆనవాళ్లు లేకపోవడం, అలాంటి వేరుశనగకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న కారణంగానే ఎక్కువ ధర చెల్లించైనా కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు.
-లక్ష్మారెడ్డి, వనపర్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్
ఇదీ చూడండి: పోలీసులు కస్టడీలో కిడ్నాపర్లు.. కొనసాగుతోన్న విచారణ