చేపలు పట్టేందుకు వెళ్లి వల చుట్టుకుని వాగులో మునిగి ఓ వృద్ధుడు చనిపోయిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కొమిరె బుడ్డన్న (65)కు గోపాల్‌పేట నుంచి చెన్నూరు గ్రామానికి వెళ్లేదారికి సమీపంలో పొలం ఉంది. అక్కడే గుడిసె వేసుకుని భార్యతో కలిసి ఉంటున్నారు. గుడిసెకు సమీపంలోనే పెద్దవాగు ఉంది. మంగళవారం ఉదయం చేపల కోసమని బుడ్డన్న వాగులో వలను కట్టడానికి వెళ్లాడు.
వర్షానికి కాల్వలో నీటి ఉద్ధృతి పెరిగింది. చేపల వల బుడ్డన్న కాళ్లకు చుట్టుకోవటం వల్ల బయటకు రాలేక గల్లంతయ్యాడు. తండ్రి ఎంతకూ రాకపోగా.. కుమారుడు వెళ్లి వెదికాడు. ఎంత వెతికినా బుడ్డన్న ఆచూకీ లభించలేదు. చీకటిపడే సమయంలో దూరంగా చెట్ల మధ్య మృతదేహం తేలింది. బుడ్డన్నకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.