వనపర్తి జిల్లా పరిధిలోని గోపాల్పేట మండలంలోని ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన బండరాయిపాకుల, అనుసంధాన గ్రామస్థులకు వెంటనే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి అధికారులకు సూచించారు. బండరాయిపాకులలో పర్యటించిన ఆచారి... గ్రామస్థులతో చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో పాల్గొన్నారు.
గ్రామస్థులకు నిర్మించి ఇవ్వాల్సిన ఇళ్లకు కావలసిన స్థలాన్ని కేటాయించాలని... అందుకు అన్ని ఏర్పాట్లు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఇంకా కొంత మందికి పరిహారం అందలేదని.. ఈ విషయంలో కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు. స్పందించిన కలెక్టర్... రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.