రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. రైతు వేదికల శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంతో పాటు మనిగిల్ల, మోజర్ల, వెల్టూరు, పామిరెడ్డిపల్లి, బలిజపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తకోట మండలంలోని శంకర సముద్రం రిజర్వాయర్ నుంచి పెద్దమందడి మండలం మోజర్ల మీదుగా వెల్టూరు గోపాల సముద్రానికి అనుబంధ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రూ. 2 కోట్లతో చేపట్టనున్న ఈ కాలువ నిర్మాణంతో పెద్దమందడి, దేవరకద్ర, అడ్డాకుల, కొత్తకోట మండలాలకు సంవత్సరం పాటు సాగునీరు అందుతుందని మంత్రి పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వం సూచించిన నియంత్రిత విధానంలో పంటలు సాగు చేయాలని సూచించారు. మూసధోరణి వీడి.. నూతన పంటలను సాగు చేసిన నాడే రైతులు వ్యవసాయ, ఆర్థిక అభివృద్ధి సాధించిన వారవుతారని మంత్రి పేర్కొన్నారు.
పెద్దమందడి మండల పరిధిలో 6 రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నామని.. ఈ వేదికల ద్వారా వ్యవసాయంలో నూతన పద్ధతులపై రైతులు ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లొచ్చని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష, జిల్లా రైతుబంధు అధ్యక్షులు జగదీశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి: 'అవకాశం ఉన్న ప్రతిచోటా మొక్కలు నాటండి'