కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన అన్ని రకాల పంటలను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని అధికారులకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, వైద్య అధికారులతో వనపర్తి నుంచి మంత్రి దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి తెచ్చేలా రైతులకు సూచనలివ్వాలని చెప్పారు. ధాన్యాన్ని తీసుకునేటప్పుడు మిల్లర్లు అధికంగా తరుగుతీస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
శనగల కొనుగోలులో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ప్రైవేటు గోదాములు, ఫంక్షన్‌హాళ్లను తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌కు అవసరమైన ఎరువులు, విత్తనాలపై ముందే ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఎరువులు, విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించాలని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా మాచినేనిపల్లి వద్ద మామిడి హోల్‌సేల్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వచ్చే ఖరీఫ్ నుంచి జీలుగ, పెసర, పిల్లి పెసర విస్తారంగా సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి: ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్