షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. లబ్ధిదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఎస్సీ లబ్ధిదారులకు 2015-16 ఉప ప్రణాళికకు సంబంధించి ట్రాక్టర్లు, ఆటోలను మంత్రి పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని.. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాలు అమలు చేస్తుందని మంత్రి తెలిపారు. స్వయం ఉపాధి పథకాల కింద సహాయం చేస్తుందని వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్, జిల్లా పరిషత్ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మల్లికార్జున్, స్టాండింగ్ కమిటీ సభ్యులు మునీరుద్దీన్, భీమయ్య, లక్ష్మీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.