Government Hospital in Wanaparthi: ప్రభుత్వ దవాఖానాల్లో మృతదేహాలను భద్రపర్చడానికి తగిన సౌకర్యాలు లోపిస్తున్నాయి. రోడ్డు, అగ్ని ప్రమాదాలు, ఇతర ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటి, రెండు రోజుల పాటు భద్రపర్చాల్సివస్తే అందుకు ప్రధానంగా అవసరమైన శీతలీకరణ పెట్టెలు అందుబాటులో లేవు. ఈ కారణంగా ఆసుపత్రుల్లోని శవాగారాల్లో మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో శవాగారంలోకి వచ్చే పందికొక్కులు, ఎలుకలు కొరుక్కుతింటున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా ప్రధాన ఆసుపత్రుల్లో శవాగారాల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. వసతులు లోపించడంతో బాధితులు ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దెకు ఫ్రీజర్లు తెచ్చుకుంటున్నారు.
వనపర్తికి సమీపంలోనే 44వ నంబరు జాతీయ రహదారి ఉంది. ఈ మార్గంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినా జిల్లా ఆసుపత్రికే తరలిస్తుంటారు. రోడ్డు ప్రమాదాలు, బలవన్మరణాలు, హత్యలు, గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలు నెలలో 30వరకు వనపర్తి జిల్లా ఆసుపత్రికి వస్తుంటాయి. ఒక్కోసారి రోజుకు రెండు, మూడు వస్తాయి. శవాగారంలో భద్రపరిచేందుకు శీతలీకరణ పెట్టెలు అందుబాటులో లేకపోవడంతో అనాటమీ విభాగంలోని గద్దెల మీదనే మృతదేహాలను వదిలేస్తున్నారు. గంటలు గడుస్తున్నకొద్దీ మృతదేహాల నుంచి వచ్చే దుర్వాసనతో బంధువులు అవస్థలు పడుతున్నారు.
మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, సహాయకులు ముక్కు మూసుకుని మౌనంగా రోదిస్తున్నారు. వనపర్తిలో ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభం కావడంతో ఆసుపత్రిలో పడకల సంఖ్యను పెంచినా శవాగారాన్ని మాత్రం ఆధునీకరించలేదు. ఒకటి, రెండు రోజుల పాటు అలాగే ఉంచి పోస్టుమార్టం అనంతరం ఇళ్లకు తీసుకు వెళ్తున్నారు. దీనిపై సర్కారు దృష్టి సారించాలని జనం కోరుతున్నారు.
వనపర్తి జిల్లా కేంద్ర ఆసుపత్రికి రెండు శీతల పెట్టెలు మంజూరయ్యాయని త్వరలోనే వాటిని వాడుకలోకి తీసుకువస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దాదాపు అన్ని ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని జనం వాపోతున్నారు.
"అన్ని విధాల ప్రభుత్వ సౌకర్యాలు ప్రజలకు అందిస్తున్నాం. ఇటీవల మృతదేహాలను ఉంచేందుకు రెండు శీతలీకరణ పెట్టెలు వచ్చాయి. అందులో నాలుగు మృతదేహాలను ఉంచవచ్చు. ఇలాంటి వాటిలో గుర్తు తెలియని మృతదేహాలను ఎక్కువ కాలం ఉంచేందుకు ఉపయోగపడతాయి. త్వరలోనే మరిన్ని సౌకర్యాలు ప్రభుత్వం అందించనుంది. ఇప్పటి వరకు ఇలాంటి సమస్య ఏమి రాలేదు." -ప్రభాకర్, ఆర్‌ఎంఓ
ఇవీ చదవండి: