వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్ల చెరువు మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా చెరువులోకి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీటిని మళ్లించారు. చెరువులో నీరు ఫుల్ ట్యాంక్ లెవల్- ఎఫ్టీఎల్ వరకు చేరింది. గత 40 ఏళ్లుగా... నీళ్లు లేక బోసిపోయి ఉన్న చెరువు ఇప్పుడు నిండుకుండలా పారుతోంది. ఫలితంగా చెరువు చుట్టుపక్కన వెలసిన అక్రమ వెంచర్లు మునిగిపోయాయి. ఈ వెంచర్లో కొన్ని వందల సంఖ్యలో ప్లాట్లు కొనుగోలు చేసిన లబ్ధిదారులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
పాతికేళ్లుగా గమనించలేదు..
218 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువులోకి 40 ఏళ్లుగా నీళ్లు లేవు. చెరువు చుట్టూ ఉన్న పట్టాదారులు తమ పొలాలను స్థిరాస్తి వ్యాపారులకు విక్రయించారు. వారు ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు ఎఫ్‌టీఎల్‌లోనే అక్రమంగా వెంచర్లు వేశారు. ఎప్పుడో పాతికేళ్ల కింద కొనుగోలు చేసిన వారు స్థానికులు కాక బయటి ప్రాంతాల వారు అయినందున ఆ ప్లాట్ల కేసి ఎవరూ గమనించలేదు. తీరా ఇప్పుడు చెరువు నిండి అలుగు పారడం వల్ల నీరు ఎఫ్టీఎల్ దాటి వచ్చింది.
800 ప్లాట్లు ఉంటాయని అంచనా..
ఈ పరిణామంతో అక్రమంగా వేసిన ప్లాట్లు నీటిలో మునిగిపోయాయి. ఇవి దాదాపు 800 వరకు ఉంటాయని అంచనా. చెరువు నీటిలో మునిగిపోయిన ప్లాట్లన్ని అక్రమ వెంచర్లు వేసినవేనని.. వాటిని కొన్నవారికి ఎలాంటి హక్కులు చెందవని నీటిపారుదల శాఖ అధికారులు, మున్సిపాలిటి, తహసీల్దార్లు సంయుక్తంగా నోటీసులు జారీ చేశారు. అక్రమ వెంచర్లు వేసిన స్థిరాస్తి వ్యాపారులు ఎఫ్టీఎల్ను తగ్గించేందుకు నీటిపారుదల శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎఫ్టీఎల్ తగ్గిస్తే అలుగు ద్వారా నీరు బయటికి పోయి ప్లాట్లు తేలుతాయని స్థిరాస్తి వ్యాపారులు ఆలోచిస్తున్నారు. ఒకసారి ప్లాట్లు తేలాక లబ్ధిదారులను ఊరడించి.. ఎలాగోలా సర్దిచెప్పాలని భావిస్తున్నారు.
ఇవీ చూడండి: 'పుర' ఎన్నికల సందడి.. అమల్లోకి ప్రవర్తనా నియమావళి