Gift a Smile Vehicles: వనపర్తి జిల్లాలో "గిఫ్ట్ ఎ స్మైల్" కింద జిల్లా వైద్యారోగ్యశాఖకు అప్పగించిన అంబులెన్స్ వాహనాల నిర్వహణ గందరగోళంగా మారింది. జిల్లా ఆస్పత్రి సహా... శ్రీరంగాపూర్, ఖిల్లా ఘనపూర్, పెద్దమందడి, వీపనగండ్ల, గోపాల్ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.... చిన్నంబావి, తాడిపర్తి ఉపకేంద్రాలకు 10 అంబులెన్స్ వాహనాలను పలువురు రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, బ్యాంకులు విరాళంగా అందించాయి. దాతలిచ్చిన వాహనాలను సాధారణంగా 108 సేవలకు అధికారికంగా అప్పగించటం లేదంటే... వైద్యారోగ్యశాఖే నిర్వహణ భరించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్వర్వులు రాకపోవటంతో 108కు సైతం ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. వాడకాన్ని బట్టి ఒక్కో వాహనానికి సగటున నెలకు లక్ష నుంచి 2లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తుండగా.. వీటిని ఎవరు భరించాలన్నది ప్రశ్నార్థకంగా మారింది.
రోగులే భరించాలని వస్తోంది..: 10వాహనాల్లో వీపనగండ్ల, గోపాల్ పేట, శ్రీరంగాపురం, ఖిల్లాఘన్పూర్లో గతంలో 104 వాహనాలకు డ్రైవర్లుగా పనిచేసిన వారినే డ్రైవర్లుగా నియమించి వినియోగిస్తున్నారు. కానీ నిర్వహణ ఖర్చులను మాత్రం రోగులే భరించాల్సి వస్తోంది. డ్రైవర్లు లేని చోట ఈ వాహనాలను వినియోగించకుండా అలాగే వదిలేశారు. వనపర్తి జనరల్ ఆస్పత్రిలో మాత్రం వైద్య విధాన పరిషత్, అభివృద్ధి నిధులతో ఈ వాహనాలు సద్వినియోగం చేసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
108గా మారిస్తే.. :"గిఫ్ట్ ఏ స్మైల్" కింద వచ్చిన ఈ వాహనాల నిర్వహణపై నిధులు, మార్గదర్శకాలు గాని ప్రభుత్వం నుంచి రాలేదని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ద్వారా కమిషనర్, 108కు లేఖలు రాసినట్లు.. వారి సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం గిఫ్ట్ ఎ స్మైల్ వాహనాలు అందుబాటులో ఉన్న మండలాల్లో 108 వాహనాలు అందుబాటులో లేవు. విరాళంగా ఇచ్చిన వీటిని ఈఎంఆర్ఐకి అప్పగిస్తే.... 108 సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: