తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలు... ప్రపంచంలో మరెక్కడా లేవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పరిధిలోని పలు మండలాల్లో రైతు వేదికల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అన్నదాతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి, సంఘటితం చేయటమే వీటి ప్రధాన ఉద్దేశమని తెలిపారు. 5వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా తీసుకొని... రాష్ట్రవాప్తంగా 2,604 రైతు వేదికల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందని... రానున్న విజయదశమి నాటికి వీటి నిర్మాణం పూర్తి కానుందని పేర్కొన్నారు. ఒక్కో రైతు వేదికకు రూ.22 లక్షల చొప్పున వ్యయం చేయనున్నట్టు తెలిపారు. వీటి నిర్మాణానికి వ్యవసాయశాఖ, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధుల నుంచి సంయుక్తంగా ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణానికి స్థలం కేటాయించిందని... కొన్ని చోట్ల దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి వీటి నిర్మాణాన్ని చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
వనపర్తి, పానగల్ మండలాల్లో రైతు వేదికల నిర్మాణానికి అయ్యే ఖర్చును తమ కుటుంబసభ్యులు భరించనున్నారని ఆయన వివరించారు. ఈ రైతు వేదికల ద్వారా సాంకేతిక పద్ధతులు, ఆధునిక వ్యవసాయ విధానాలు అన్నదాతలకు తెలియడంతో పాటు రైతుల్లో ఐకమత్యం ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతు వేదికల ఏర్పాటుతో తమలోని అంతర్గత సమస్యలపై... రైతులందరూ ఒకేచోట కూర్చొని చర్చించుకునేందుకు ఆస్కారముంటుందన్నారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దగూడెం, సవాయిగూడెం, నాగవరం, చందాపూర్, కాశీ నగర్, చిట్యాల, చిన్నగుంటపల్లి, పెబ్బేర్ మండలాల్లో పర్యటించి... రైతు వేదికల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా పాలనాధికారి షేక్ యాస్మిన్ భాష పాల్గొన్నారు.
ఇదీ చూడండి : కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి