పశువుల పాక మంజూరు కోసం రూ.5వేలు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఉపాధి హామీ పథకం అధికారులను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం మండల పరిషత్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఇంజినీర్ రషీద్, టెక్నికల్ అసిస్టెంట్ బంగారయ్య పట్టుబడ్డారు.
రేవల్లి మండలం చిర్కపల్లికి చెందిన రైతు శివరాములు... జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల పాక మంజూరు కోసం నవంబర్లో దరఖాస్తు చేసుకున్నాడు. పశువుల పాక మంజూరు చేసేందుకు ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్ రూ.5వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారుల చుట్టూ తిరిగి వేసారిన రైతు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు.
ఏసీబీ అధికారుల సూచనల మేరకు రైతు శివ రాములు... రూ.4 వేలు తీసుకొని మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లగా... ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కోర్టులో ఏడుగురు జడ్జిలు సహా 44 మందికి కరోనా