ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఆదివారం మరో 47 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 451కి చేరింది. అత్యధికంగా వనపర్తి జిల్లాలో 14 కేసులు నమోదు కాగా.. నాగర్‌కర్నూల్ జిల్లాలో 13, మహబూబ్‌నగర్ జిల్లాలో 9, గద్వాల జిల్లాలో 7, నారాయణపేట జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరు, నారాయణపేట జిల్లాలో ఒకరు మృత్యువాతపడ్డారు.
వనపర్తిలో..
వనపర్తి జిల్లాలో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. పట్టణంలోని బ్రాహ్మణవీధికి చెందిన ఒకే ఇంట్లో నలుగురికి వైరస్ సోకింది. పీర్లగుట్ట, బండారునగర్, కేడీఆర్ నగర్, టీచర్స్ కాలనీల్లో ఒక్కొక్కరు ఈ వైరస్ బారినపడ్డారు. కొత్తకోటలో మరో 6 కేసులు నిర్ధారణయ్యాయి.
నాగర్‌కర్నూల్‌లో..
నాగర్‌కర్నూల్ జిల్లాలో 13 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు. అచ్చంపేట పట్టణంలో 8 మంది కరోనా బారినపడగా.. కన్యకా పరమేశ్వరి దేవస్థానం సమీపంలో ఓ ప్రైవేట్ ఉద్యోగితో పాటు పాత బస్టాండ్ సమీపంలో నివసించే ఒక డ్రైవర్, కిరాణా దుకాణ యజమాని వైరస్ బారినపడ్డారు.
గతంలో కరోనా సోకిన ఓ కిరాణా దుకాణ యజమానికి సంబంధించిన ఇద్దరు ప్రైమరీ కాంటాక్టులకు కరోనా సోకగా.. బల్మూర్, లింగాల పోలీస్స్టేషన్లలో పనిచేసే ఓ కానిస్టేబుల్, ఓ హోంగార్డులకు వైరస్ సోకింది. తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అమ్రాబాద్ మండలం బీకే ఉప్పునుంతల గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌కు, చారకొండలో ఓ మేస్త్రీకి, నాగర్‌కర్నూల్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఒక విద్యార్థితో పాటు పట్టణంలో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని నాగర్‌కర్నూల్ వైద్యాధికారి తెలిపారు.
మహబూబ్‌నగర్‌లో..
మహబూబ్‌నగర్ జిల్లాలో 9 మంది కరోనా బారినపడగా.. ఒకరు మృతి చెందారు. కొత్త చెరువురోడ్డు, శ్రీరామ కాలనీ, అస్లాంఖాన్ వీధి, దోబివాడలో ఒక్కొక్కరు, షాషాబ్‌గుట్టలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయింది. బాలానగర్ మండల కేంద్రంలో ఇద్దరు, హన్వాడ మండల కేంద్రంలో ఒకరికి వైరస్ సోకింది. జడ్చర్ల మండల కేంద్రానికి చెందిన ఇద్దరు ఈ మహమ్మారి బారినపడ్డారు.
నారాయణపేటలో..
నారాయణపేట జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబంలో 12 మందికి ఇదివరకే కొవిడ్-19 నిర్ధారణయింది. అదే కుటుంబంలో మరొకరు వైరస్ బారినపడగా.. ఒకరు మృతి చెందారు. నారాయణపేట మండల పరిధిలోని జాజాపూర్‌కు చెందిన మరొకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
జోగులాంబ గద్వాలలో..
జోగులాంబ గద్వాల జిల్లాలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయింది. గద్వాల పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన ఇద్దరు, దేవాలయం వీధికి చెందిన ముగ్గురు, పాత హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మరొకరు ఈ వైరస్ బారినపడ్డారు. అలంపూర్ పట్టణానికి చెందిన ఓ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు.