వరికి క్వింటాకి రూ.2500 మద్దతు ధర ఇవ్వాలని ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం చర్లపల్లి, మదనాపురం మండలం దంతనూరులో కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారని ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో కార్పోరేట్ శక్తులకే మేలు జరుగుతుందని విమర్శించారు.
రైతులకు నష్టాలే...
రైతులకు నష్టాలని కల్గించే వ్యవసాయ బిల్లులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. రైతు సంతకాల సేకరణ ద్వారా వాటిపై వ్యతిరేకత తీవ్రతను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. రాష్ట్రంలో నియంత్రణ సాగు విధానంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారని ఆరోపించారు. ప్రభుత్వ సూచనతో సన్న రకాలు సాగు చేసిన అన్నదాతలకు నష్టాలే మిగిలాయని విమర్శించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి ప్రదీప్ గౌడ్, కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు శేఖర్ రెడ్డి, బాలమన్నెమ్మ, నరేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, రాధ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రూ.313.65 కోట్ల వ్యయంతో లింక్ రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్