చెత్త సేకరణతో పాటు చెత్తను వేరు చేసే విషయంపై గ్రామాలు, మున్సిపాలిటీల వారిగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష సూచించారు. వనపర్తిలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సిబ్బందికి 'పారిశుద్ధ్యం, ఘన వ్యర్థ నిర్వహణ'పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ప్రత్యేక అధికారులు గ్రామాల్లో చెత్త సేకరణపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని, ఇందుకుగానూ గ్రామాల వారిగా, మున్సిపాలిటీ వారిగా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. మరోసారి చెత్త సేకరణ, చెత్తను వేరు చేయటంపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మున్సిపాలిటీలు , గ్రామాల్లోని పారిశుద్ధ్య సిబ్బంది ,పోలీసు ,రెవెన్యూ, అధికారులు, సిబ్బంది అందరూ ఐకమత్యంగా, బాధ్యతతో పని చేయటం వల్లే మొదటి నుంచి వనపర్తి కరోనా రహిత జిల్లాగా నిలబడిందన్నారు. ఇందుకు కృషి చేసిన వారందరిని కలెక్టర్ అభినందించారు.