బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకునే చిన్నారి లేత కాలికి చిన్న ముళ్లు గుచ్చుకుంటేనే మనసు చివుక్కుమంటుంది. అలాంటిదీ వనపర్తి జిల్లా వీపనగండ్లలో ఓ చిన్నారి శరీరం లోపల ఏకంగా పదికి పైగా సూదులు గుచ్చుకుని ఉన్నాయి. అశోక్, అన్నపూర్ణ దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉండగా... బాలుడు రోజూ ఏడుస్తోంటే తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
మలంలో బయటపడిన సూదులు...
ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక బాధపడుతున్న సమయంలో... బాలుని మలవిసర్జనలో ఒక సూది బయటపడింది. ఆ చిన్నారే తిని ఉంటాడులే అని భావించిన తల్లిదండ్రులు... బాలుడి మల ద్వారాన్ని శుభ్రం చేసే క్రమంలో మరో సూది చేతికి తగిలింది. అనుమానం వచ్చి పరికించి చూడగా... మరో సూది ఉందని గుర్తించారు. దాన్ని తీసేందుకు ప్రయత్నించగా... రాకపోయేసరికి ఆసుపత్రులను ఆశ్రయించారు.
నిలోఫర్లో స్పందన కరవు...
మొదట హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రికి వెళ్లగా... అక్కడి వైద్యులు సరిగా స్పందించలేదు. ఇక ఫలితం లేదనుకుని ఇతర ఆసుపత్రులను ఆశ్రయించారు. ఎక్కడా... సరైన వైద్యం అందకపోవటం వల్ల... వనపర్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలుడిని చూపించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి బాలుడి శరీరంలో పదికి పైగా సూదులు ఉన్నట్లు గుర్తించారు.
పది వచ్చాయి.. ఇంకా రెండున్నాయి...
వెంటనే శస్త్ర చికిత్స చేసి సూదులను బయటికి తీసేశారు. మరో రెండు సూదులు పొట్ట భాగంలో ఉన్నాయని... వాటికోసం బాలుడి కడుపులో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు. దానికి కొంత సమయం కావాలన్నారు వైద్యులు.
ఎవరో కావాలనే ఇలా చేశారనే అనుమానాన్ని బాలుని తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనులకు వెళ్లే సమయంలో పక్కింట్లో చిన్నారిని వదిలి వెళ్లేవాళ్లమని... వాళ్లేమైనా ఇలాంటి పని చేశారేమోనని అనుమానిస్తున్నారు. వీపనగండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... చిన్నారి శరీరంలోకి ఇన్ని సూదులు ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.