వికారాబాద్ జిల్లాలో పరిగి, తాండూరు, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాలున్నాయి. దాదాపు 9 లక్షల జనాభా ఉంటే 2 లక్షల మంది రైతులున్నారు. 1.75 హెక్టార్ల సాగు భూమి ఉంది. సహజ నీటి వనరులు పెద్దగా లేకపోవడంతో రైతులందరూ ప్రకృతిపైనే ఆధారపడతారు. ప్రధాన నీటి వనరులుగా కోట్‌పల్లి, శివసాగర్, లఖ్నాపూర్ జలాశయాలు కొనసాగుతున్నాయి. వీటి ద్వారా కొన్ని వందల ఎకరాలకు మాత్రమే సాగు నీరు లభిస్తోంది.
కేంద్రం ‘జల అభియాన్
నీటి సంరక్షణకు ప్రత్యేకంగా కేంద్రం ‘జల అభియాన్’ పథకాన్ని ప్రవేశపెట్టింది.దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని రెండు దఫాలుగా అమలు చేసేందుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటించారు. వాన నీటి సంరక్షణతోపాటు జల వనరుల్ని పునరుద్ధరింపజేస్తూ వాటర్‌షెడ్‌ల అభివృద్ధికి ఖరారు చేసింది. సరిగ్గా ఈ ఉద్దేశంతోనే నీటి సమస్యలను అధిగమించేందుకు కేంద్రం నడుం బిగించింది.తాజా పథకంతో జిల్లాలో నీటి వనరులు మరింత అభివృద్ధి పథంలోకి వచ్చే అవకాశం ఉంది.
సరైన వర్షాలు లేవు
రెండేళ్ల నుంచి సరైన వర్షాలు లేవు. దీంతో నీటి మట్టాలు తగ్గడంతో జలాశయాలు సైతం ఒట్టిపోయే పరిస్థితి నెలకొంది. లోటు వర్షపాంతో కాగ్నా నది పరివాహక ప్రదేశాలు ఎడారుల్ని తలపిస్తున్నాయి. తాండూరు, పాత తాండూరు, నారాయణ్‌పూర్, గోనూరు, వీర్‌శెట్టిపల్లి, చంద్రవంచ, చిట్టిగణాపూర్, ఖాంజాపూర్‌లో కాగ్నా నది పారకంలేక సాగు నీటి కొరత నెలకొంది.ఈ క్రమంలో నీటి సంరక్షణ చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తు ఏకంగా ప్రత్యేక పథకాన్ని అమలులోకి తెచ్చింది.
రెండు విడతల్లో అమలు
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జలఅభియాన్ పథకాన్ని రెండు విడతల్లో అమలు చేసేందుకు ఖరారు చేశారు. తొలివిడతలో సెప్టెంబరు 30తేదీ వరకు మలివిడత కార్యాచరణను అక్టోబరు ఒకటో తేదీ నుంచి నవంబరు 30తేదీ వరకు నిర్వహించనున్నారు. పథకం ద్వారా ప్రధానంగా ఐదు అంశాలను ఆచరణలో పెట్టనున్నారు.
- ఒకరోజంతా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరినీ భాగస్వాముల్ని చేసి శ్రమదానం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో నీటి సంరక్షణ, వాన నీటి నిల్వకు నిర్మాణాలు చేస్తారు. గ్రామాలు, పట్టణాల్లోని చెరువులు, కుంటల్ని పునరుద్ధరిస్తారు. నీటి రీఛార్జికి అవసరమైన నిర్మాణాలను పూర్తి చేస్తారు.
- వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పట్టణాల్లో ఇళ్ల నుంచి వచ్చే వృథా నీటిని తిరిగి శుద్ధి చేయడం ద్వారా పరిశ్రమలకు, వ్యవసాయానికి మళ్లించి నీటిని వినియోగంలోకి తీసుకు వస్తారు. అందుకు ఇంజనీర్లు, శాస్త్రవేత్తల సహకారంతో జలవనరుల్ని అభివృద్ధి చేస్తారు. అభివృద్ధికి కేటాయించే 65శాతం నిధుల్లో ఎక్కువ మొత్తం నిధుల్ని నీటి వనరుల అభివృద్ధికి ఖర్చు చేసేలా కేంద్ర మంత్రి ఆదేశించారు.
గడువు పొడిగింపు అవసరం.
కేంద్రం ప్రవేశపెట్టిన జల అభియాన్ పథకంలో వాటర్ షెడ్‌లను బాగా అభివృద్ధి చేసేందుకు ఖరారు చేశారు. ఇది ఆచరణలోకి తేవడం ద్వారా జిల్లాలో ఇప్పటికే అమలవుతున్న వాటర్‌షెడ్ (ఐడబ్ల్యుఎంపీ) పథకంతో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలవుతుంది. జిల్లాలో తాండూరు, పెద్దేముల్, ధారూరు, దౌల్తాబాద్ మండలాల్లో 2012 నుంచి వాటర్‌షెడ్ పథకం అమలు చేస్తున్నారు. పథకం కింద నీటి వనరుల్ని పెంపోందించడంతోపాటు ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టేందుకు మూడవ ఫేజ్‌లో రూ.3.15కోట్లు మంజూరు చేశారు. ఆరు సంవత్సరాల వ్యవధిలో రూ.2.40కోట్లు ఖర్చు చేశారు. ఇటీవల గడువు ముగియడంతో జూన్ 30 వరకు పొడిగించారు. అయినా కూడా వరుస ఎన్నికలతో పెద్దగా పనులు కొనసాగించకపోవడంతో ఇంకా రూ.70లక్షలు మిగిలిపోయాయి.ఉన్నతాధికారులు దృష్టిసారించి గడువు పొడిగింపజేయాలని వాటర్‌షెడ్ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఉపాధిహామీలో విలీనం
ప్రస్తుతం వాటర్‌షెడ్ పథకం ద్వారా నిర్వహిస్తున్న పనులపై అధికారులు పర్యవేక్షణ లేకుండా పోయింది. గతంలో కేంద్ర ప్రభుత్వం వాటర్‌షెడ్‌ను ఉపాధిహామీ పథకంలో విలీనం చేయడంతో జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయాలను ఎత్తివేశారు. సిబ్బందిని కుదించి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లోకి పంపించారు. అరకొర సిబ్బందితో వాటర్‌షెడ్ పనులు చేయిస్తున్నారు. సాంకేతిక సహాయకుల ద్వారా వాటర్‌షెడ్ పనుల్ని నెట్టుకొస్తుండగా నాసిరకం పనులకు ఊతమిస్తున్నాయి. తాజాగా కేంద్రం జలఅభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టగా జిల్లాకు ఒకరి చొప్పున సంయుక్త కార్యదర్శిని నియమించబోతోంది. దీంతోపాటు ఉపకార్యదర్శులను నియమించనుండటంతో వాటర్‌షెడ్ పనుల పర్యవేక్షణ గాడినపడుతుంది.
పెరగనున్న ప్రజా భాగస్వామ్యం
వాటర్‌షెడ్ పనులు చేపట్టేందుకు సంబంధిత గ్రామాల్లో సర్పంచి ఛైర్మన్‌గా ఏడుమందితో వాటర్‌షెడ్ కమిటీలను ఏర్పాటు చేశారు. వాస్తవానికి వాటర్‌షెడ్ పనుల్ని కమిటీల తీర్మానం, పర్యవేక్షణ నడుమ కొనసాగించాలి. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన పథకంతో అన్నివర్గాల భాగస్వామ్యం పెరుగుతుంది. పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థుల దగ్గర్నుంచి స్వచ్ఛందసంస్థలు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, ఎన్‌సీసీ క్యాడెట్లు, నెహ్రు యువకేంద్రాల్లోని యువతీయువకులు, పర్యావరణ ప్రేమికుల్ని భాగస్వామ్యం చేయనున్నారు.
ఇదీ చూడండి : గోల్కొండ కోటలో బోనాల సందడి