రాబోయే వర్షాకాలంలో హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్విహంచాలనే లక్ష్యంతో వికారాబాద్ జిల్లా అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏ రకమైన మొక్కలకు ప్రజల నుంచి డిమాండ్ ఉంది. గృహ, వ్యవసాయ, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో ఎటువంటి మొక్కలు నాటించాలనే కసరత్తు ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం నర్సరీల్లో ఆయా మొక్కలను పెంచుతున్నారు. జూన్ మూడో వారం లేదా జులై మొదటి వారం నుంచి హరితహారం ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది.
అవసరమైనవే ఎంపిక...
జిల్లాలో ఈఏడాది మొత్తం 77.96 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. అందుకు అనుగుణంగా 565 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇంటి ఆవరణలో పెంచుకునే తులసి, మునగ, బొప్పాయి, కమ్యూనిటీ ప్లాంటేషన్‌కు అవసరమైన కానుగ, రైతులు పొలం గట్లపై పెంచేందుకు అనువైన టేకు, అటవీ ప్రాంతంలో నాటేందుకు అవసరమైన ఔషధ గుణాలున్న మొక్కలతో పాటు ఇతర రకాలను సిద్ధం చేస్తున్నారు.
గత అనుభవాలతో...
2018-19లో జిల్లా వ్యాప్తంగా 1.5 కోట్లు మొక్కలు నాటాలని నిర్దేశించగా సుమారు 90 లక్షలు నాటారు. గతేడాది జిల్లా హరితహారం లక్ష్యం 2.5 కోట్ల మొక్కలుగా నిర్ణయించి, 1.36 కోట్లు మాత్రమే నాటించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి అంతకంటే తక్కువే ఉండొచ్చని అంచనా. కొన్ని ప్రభుత్వ విభాగాలకు లక్ష్యం కేటాయించగా మొక్కలు తీసుకెళ్లి, నాటకుండా పారేసిన సంఘటనలు అప్పట్లో వెలుగు చూశాయి. ఈ ఏడాది అలా కాకుండా వాస్తవంగా ఎంత సాధ్యమో అంతే లక్ష్యంగా తీసుకోవాలని జిల్లా అధికారులు నిర్ణయించారు.
పంచాయతీరాజ్ 26.03 లక్షలు, గ్రామీణాభివృద్ధి 19.82 లక్షలు, అటవీశాఖ 12 లక్షలు, వ్యవసాయం, ఆబ్కారీ, విద్యా శాఖల లక్ష్యం లక్షకు పైగా ఉండగా, పౌర సరఫరాల విభాగానికి కేవలం 6 వేల మొక్కలే నిర్ణయించారు. మే చివరి నాటికి కనీసం ఒకటిన్నర మీటరు నుంచి మూడు మీటర్ల ఎత్తు పెరిగిన మొక్కలు మాత్రమే నాటించాలని భావిస్తున్నారు. అయితే టేకు వంటి మొక్కలు ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ నాటేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
వంద శాతం లక్ష్యం సాధిస్తాం...
ఏటా లక్షల్లో మొక్కలు నాటిస్తున్నామని డీఆర్‌డీఓ కృష్ణన్ తెలిపారు. అయినా లక్ష్య సాధన శాతం తక్కువగా కనిపిస్తోందన్నారు. ఈ ఏడాది వంద శాతం లక్ష్యం చేరుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రజలు ఎలాంటి మొక్కలు కోరుకుంటున్నారో గుర్తించి ఆయా గ్రామాల పరిధిలోని నర్సరీల్లో వాటినే పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.