- 'మాకు పెద్ద పెద్ద భవనాలు వద్దు.. లైబ్రెరీలూ వద్దు.. సరిపడా ఉపాధ్యాయులను నియమించండి.. చాలు చదువుకుంటాం'
- 'నా పేరు తనూజ.. పదో తరగతి చదువుతున్నాను.. ప్రస్తుతం మా పాఠశాలలో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నారు. మొత్తం సబ్జెక్టులన్నీ ఒక్కరే చెప్పాల్సి వస్తోంది.'
- 'బయటంతా ప్రభుత్వ బడుల్లో బాగా చదువు చెబుతున్నారని చెప్పారు కానీ ఇక్కడేమో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ అసలు టీచర్లే లేదు. మొత్తం ఏడు సబ్జెక్టులకు ఒకరే సారు ఉన్నారు.'
ఇది వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం కడ్మూర్ జిల్లా పరిషత్ పాఠశాల దుస్థితి. ఎన్నో కలలతో ఇక్కడ అడుగెట్టిన విద్యార్థులు.. టీచర్లు లేక.. సిలబస్ పూర్తికాక.. ఏం చదవాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఈ పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ మొత్తం 87 మంది విద్యార్థులున్నారు. కానీ ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నారు. ఆ ఒక్కరే ఆరో తరగతి నుంచి పది వరకు అన్ని సబ్జెక్టులను బోధన చేయాల్సి పరిస్థితి ఉంటోంది.
దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల దశలోనే విద్యార్థులకు సరైన బోధన అందితేనే వారి భవిష్యత్ బాగుంటుందని చెబుతున్నారు. ప్రైవేటుకు దీటుగా పాఠాలు చెబుతామంటేనే.. ప్రభుత్వ బడులకు పంపామన్నారు. అధికారుల ఉదాసీనత తన పిల్లల పట్ల శాపంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించిన అన్ని సబ్జెక్టులకు టీచర్లను నియమించాలని కోరుతున్నారు.
'ఆరో తరగతి నుంచి పది వరకు నేను ఒక్కడితే ఉపాధ్యాయుడిని. అన్ని సబ్జెక్టులకు టీచర్లను నియమించాలని ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. తాత్కాలిక ప్రాతిపదికన కొంతమందిని కేటాయించిన వారు విధుల్లో చేరలేదు.'
- కృష్ణ, ఉపాధ్యాయుడు, కడ్మూర్ జిల్లా పరిషత్ పాఠశాల