వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చాపలగూడెం గ్రామానికి చెందిన బైండ్ల బాలయ్య కుటుంబ సభ్యులతో కలిసి బతుకు తెరువు కోసం 1999లో ముంబాయి వలస వెళ్లారు. బాలయ్య కుమారుడు రాములు నివాస ప్రాంగణంలో ఆడుకుంటూ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై కింద పడ్డాడు. ఫలితంగా రాములు తల వెనుక భాగంలో బలంగా దెబ్బ తగిలింది. మెదడు పైఎముక సైతం విరిగిపోయిందని వైద్యులు తేల్చారు.
పూర్తిగా మంచానికే పరిమితం...
దిక్కుతోచని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రంలో ఏం చేయలేక... 2002లో బాలయ్య.. తన కుటుంబ సభ్యులతో తిరిగి స్వగృహానికి వచ్చేశారు. ఇక్కడ కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాములు వయసు పెరుగుతున్న కొద్దీ నరాల కదలిక పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వల్ల మంచానికే పరిమితమయ్యాడు కదలలేని స్థితిలో ఉన్న అతడి బాగోగులు మొత్తం తల్లి, అన్నయ్యలే చూస్తుండేవారు. తల్లి పార్వతమ్మ బిడ్డకు అన్ని సేవలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది.
పోషణ మరింత భారం..
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగడం, ఇతర ఇబ్బందుల దృష్ట్యా పనులు దొరకకపోవడం మూలానా కుటుంబ పోషణ మరింత భారంగా మారింది. 8 ఏళ్లుగా మంచానికే పరిమితమైన తన తమ్ముడికి కనీస వైద్యం కూడా అందించలేకపోతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి బాధితుడ్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి : ఉస్మానియాకు సంబంధించిన అన్ని వ్యాజ్యాలు కలిపి విచారిస్తాం: హైకోర్టు