తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించడమే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో నూతన సమగ్ర వ్యవసాయ విధానంపై అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. రైతులు లాభాలు వచ్చే పంటలు మాత్రమే పండించాలని ఆమె సూచించారు. మొక్కజొన్న పంటల సాగుతో రైతులకు నష్టాలు వస్తున్నాయని, దీనివల్ల ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లుతుందని మంత్రి వెల్లడించారు. ఒకవేళ రైతులు మొక్కజొన్నలే సాగు చేయాలనుకుంటే అందులోని మరో రకం స్వీట్ కార్న్ పంటల సాగు చేసుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను కొన్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పుష్కలంగా సాగునీరు వస్తుందని, ఇదే తరహాలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కూడా పూర్తిచేసి వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారని ఆమె అన్నారు. రాష్ట్రంలో 150 కోట్ల నిధులను వ్యవసాయ రుణాల కోసం మంజూరు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో పండించే పత్తి నాణ్యత, దేశంలోని ఇతర ఏ రాష్ట్రంలోనూ లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పంట మార్పిడితో అధిక లాభాలు సాధించాలని రైతులకు సూచించారు.
ఇవీ చూడండి:పల్లె ప్రగతితో గ్రామాల్లో మార్పు కనిపిస్తోంది: సీఎస్